హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో వాన (Rain) కురిసింది. గచ్చిబౌలి, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, అమీర్‌పేట, ప్రగతినగర్, బాచుపల్లి, మూసాపేట, ఎస్ఆర్నగర్, మధురానగర్ భారీ వర్షం కురిసింది. బోరబండ, పంజాగుట్ట, బేగంపేట, అల్వాల్, తిరుమలగిరి, బోయిన్పల్లి, మారేడుపల్లి, చిలకలగూడ, ప్యారడైజ్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి, హస్తినాపురం, చంపాపేట, దిల్సుఖ్నగర్, మలక్‌పేట, నాంపల్లి, కోఠి, లక్డికాపూల్, ఖైరతాబాద్‌లో వాన పడింది. గచ్చిబౌలి, మాదాపూర్‌లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. శుక్రవారం సాయంత్రం మియాపూర్, మదీనాగూడ, చందానగర్, శేరిలింగంపల్లిలో వర్షం వచ్చింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్నిచోట్ల చెట్లు పడంతో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.
ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం రాత్రి నగరంలో వర్షం కురవడంతో పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని తెలిపింది.
మూడ్రోజులు వడగండ్ల వానలు..
ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. మార్చి 24 నుంచి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.