సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గురువారం గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది.
రాత్రి 9 గంటల వరకు హఫీజ్‌పేటలో అత్యధికంగా 2.0 సెం.మీలు, పాతబస్తీ బండ్లగూడ, మాదాపూర్‌లో 1.4 సెం.మీలు, రాజేంద్రనగర్, బాలానగర్ 1.3 సెం.మీలు, మియాపూర్, శివరాంపల్లిలో 1.2 సెం.మీలు, కూకట్పల్లి అల్లాపూర్, బాలాజీనగర్‌లో 1.1 సెం.మీలు, మాదాపూర్, గచ్చిబౌలిలో 1.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, అల్పపీడనం బలహీనపడి, ఆవర్తనంగా మారడంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.