హైదరాబాద్: రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. నగరంపై కమ్ముకున్న మబ్బులు క్రమంగా విస్తరిస్తున్నాయి. దీంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, హయత్‌నగర్, ఇంజాపూర్, తుర్కయాంజల్, అబ్దుల్లాపూర్‌మెట్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహదీపట్నం, రాంజేంద్రనగర్, శంషాబాద్, నాంపల్లి, కొండాపూర్, మియాపూర్, అంబర్‌పేట, బేగంబజార్, ఛత్రినాక, శివగంగానగర్, శివాజీనగర్, గగన్‌పహడ్‌లో వాన పడుతున్నది. కాగా, రాగల రెండు మూడు రోజుల్లో రాజధానిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వాన కురిసింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల, రాజాపూర్, బాలానగర్, మిడ్జిల్, నవాబ్‌పేట, రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్, ఆమన్‌గల్ మండలాల్లో వర్షం కురిసింది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్, నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో భారీ వర్షం పడింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోని సంగంలో 15.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్‌నగర్ జిల్లా ఉడిత్యాల్లో 15.63, రంగారెడ్డి జిల్లా కేశంపేటలో 13.1, వనపర్తి జిల్లాలో 12.3, నల్లగొండ జిల్లా గుండ్లపల్లెలో 8.7, నాగర్‌కర్నూల్ జిల్లాలో 8.5, ఆసిఫాబాద్ జిల్లా చింతలపల్లిలో 7.7, గద్వాల జిల్లా అలంపూర్‌లో 7.4, జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో 5.9, సిద్దిపేట జిల్లా చేర్యాలలో 5.4, జనగామ జిల్లా చీలాపూర్‌లో 4.8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం కురిసింది.