మారేడ్‌పల్లి, ఏప్రిల్ 9 : రైలు పట్టాలు దాటుతున్న రైల్వే ట్రాక్ మెన్‌ను రైలు ఢీ కొట్టడడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసు కుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం..అల్వాల్ ప్రాంతానికి చెందిన సురేష్ (40) వృత్తి రీత్యా రైల్వే ట్రాక్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధులు నిర్వహించిన అనంతరం సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో ప్లాట్ ఫారం నెంబర్ 1-2 మధ్యలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.