Railway Stations | చార్మినార్,ఫిబ్రవరి 18: మరికొద్ది సమయంలోనే మీరు గమ్యస్థానం చేరుకునే ట్రైన్ వస్తుందనే అనౌన్స్‌మెంట్‌తో ప్రయాణికులు అప్రమత్తం అవుతుంటారు. ఇక నుండి రైల్వే స్టేషన్లో ఆకతాయిలు ఉంటారు జాగ్రత్త అనే అనౌన్స్మెంట్ కూడా చేయాల్సి వస్తుందేమో. ఎందుకంటే.. నగరంలోని కొన్ని రైల్వేస్టేషన్లు ఆకతాయిలకు అడ్డాగా మారాయి. ఆయా రైల్వే స్టేషన్లలో ఆకతాయిలు మద్యం, గంజాయి సేవిస్తూ.. ప్రయాణికులను, స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారు.
కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలోని యాకుత్ పురా, ఉప్పుగూడ, డబిర్ పురా, ఫలక్ నుమా రైల్వే స్టేషన్లలో చీకటి పడిదంటే చాలు.. ఆకతాయిలు, మందుబాబులు వాలిపోతున్నారు. ప్లాట్‌ఫాంలను తమ స్థావరాలుగా మలుచుకుని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో తూలుతున్నారు. గంజాయి సేవిస్తూ ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. పలుమార్లు స్థానిక పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు సైతం తనిఖీలు నిర్వహించి.. రైల్వేస్టేషన్లలో గంజాయి విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న ఘటనలు ఉన్నాయి. అయినా కూడా గంజాయి అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది పోలీసుల నిఘా వైఫల్యాన్ని తేటతెల్లం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
జల్సాలకు అలవాటు పడ్డ గంజాయి బాబులు తమ అవసరాలకు డబ్బులను సంపాదించుకోవడానికి దోపిడి మార్గాలను ఎంచుకుంటున్నారని పలు ఘటనలలో పోలీసులే గుర్తించారు. రైల్వే స్టేషన్లలో గంజాయి సేవనం అనంతరం అర్ధరాత్రి సమయంలో ఈ ముఠా సభ్యులు చోరీలకు పాల్పడుతున్నారు. రైల్వే స్టేషన్లలో జనసంచారం తగ్గిన అనంతరం రాత్రి వేళలో తమ విధులను ముగించుకొని ఇంటికి వచ్చే వారిని టార్గెట్ చేస్తూ గంజాయి బ్యాచ్ దోపిడీలకు పాల్పడుతున్నారు.
సోమవారం రాత్రి 10:30 సమయంలో ఉప్పుగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళను అడ్డగించిన గంజాయి బాబులు ఆమె వద్ద నుండి విలువైన సెల్ ఫోన్‌ను తస్కరించుకుని పారిపోయారు. మరో ఘటనలో యాకుత్ పురా నుండి డబీర్ పుర వెళ్లే రైల్వే మార్గంలో మహిళా భోగిలోకి ప్రవేశించిన ఆకతాయిలు ఈవ్ టీజింగ్‌కు పాల్పడ్డారు. రైల్లో ఫిర్యాదు చేయడానికి సెక్యూరిటీ సిబ్బంది గానీ పోలీసులు గానీ లేకపోవడంతో బాధితులు ఏం చేయలేకపోతున్నారు.