ORR | సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : 150 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగు రోడ్డు వెంబడి ఉన్న 300 కిలోమీటర్ల పైచిలుకు రేడియల్ రోడ్లు, సర్వీసు రోడ్లు రోజురోజుకూ అధ్వాన్నస్థితికి దిగజారుతున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో అత్యంత కీలకమైన సర్వీసు రోడ్లను, లింకు రోడ్లను అనుసంధానం చేయాల్సి ఉన్నా వాటన్నింటినీ వదిలేసి ఫ్యూచర్‌సిటీ వసతుల వైపు దృష్టి పెట్టారు. తాజాగా ఫ్యూచర్ సిటీకి హెచ్ఎండీఏ భారీ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి రూపకల్పన చేసి.. ఇప్పటికే భూసేకకరణ ప్రక్రియ మొదలుపెట్టింది. ఇప్పుడే ఏమాత్రం అవసరం లేని ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుందే తప్ప.. నగర ప్రజలు వసతులకు సంబంధించి ప్రతినిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దృష్టి పెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు నగరంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు అనుసంధానం అత్యంత కీలకమైనది. ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు అవుటర్ రింగు రోడ్డు ఉపయుక్తంగా ఉండగా… మెట్రో నిర్మించాలనే ప్రతిపాదనలు గతకొంతకాలంగా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణానికి రాయదుర్గం లింకేజీ చేసేందుకు ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపులు కూడా పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రణాళికలను పక్కనపెట్టి, అలైన్మెంట్ మార్చి నాగోల్ నుంచి ఎల్బీనగర్ మీదుగా శంషాబాద్ అనుసంధానం చేయడంతోపాటు, అక్కడి నుంచి శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా ముచ్చెర్ల ఫోర్త్ సిటీ వరకు మెట్రో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. శంషాబాద్ నుంచి ఫోర్త్ సిటీ వరకు మెట్రో నిర్మాణానికి అవసరమైన పూర్తి ప్రాజెక్టు రిపోర్టు రూపకల్పనపై హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ దృష్టి పెట్టింది. మూడు నెలల్లో ఫోర్త్ సిటీతోపాటు, నార్త్ సిటీని అనుసంధానం చేస్తూ భారీ మెట్రో అలైన్మెంట్ డిజైన్లు ఖరారు కానున్నాయి.
ఫోర్త్ సిటీ హడావుడితో.. వసతుల లేమి
ఫోర్త్ సిటీ పేరిట కాంగ్రెస్ చేస్తున్న హడావుడితో హెచ్ఎండీఏ పరిధిలో ఇతర ప్రాంతాలకు తీరని నష్టం జరుగుతున్నది. పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలు బుట్టదాఖలు అవుతున్నాయి. ముఖ్యంగా హెచ్ఎండీఏ విస్తరించి ఉన్న ఏడు జిల్లాల పరిధిలో మెరుగైన రవాణా సౌకర్యాలను అందించే అంతర్గత, లింక్ రోడ్లు, అప్రోచ్ రోడ్లు మరుగునపడుతున్నాయి. ఇక కోర్ సిటీ నుంచి అవుటర్ రింగు రోడ్డును అనుసంధానం చేస్తూ నిర్మించనున్న స్పైక్ రోడ్ల నిర్మాణంతోపాటు, ఓఆర్ఆర్ నుంచి కొత్తగా ప్రతిపాదన దశలో ఉన్న రీజనల్ రింగు రోడ్డు మధ్య రోడ్ల అనుసంధానం పక్కన పెట్టి… కేవలం ఫోర్త్ సిటీకి మాత్రమే మెరుగైన రవాణా సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి పెడుతున్నది. దీంతోపాటు గత కొంత కాలంగా నగరంలో పలు మార్గాల్లో మెట్రో విస్తరణ పెండింగ్‌లోనే ఉంది. కానీ యుద్ధప్రాతిపదికన ఫోర్త్ సిటీ వరకు శంషాబాద్ మీదుగా మెట్రో విస్తరించేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మెట్రో ఫేజ్-2 ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండగా… ఫేజ్-2 పార్ట్ బీ కింద శంషాబాద్-ఫోర్త్ సిటీ, నార్త్ సిటీ మార్గాలను నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలను మెట్రో సంస్థ సిద్ధం చేస్తోంది.
తొలిసారిగా గ్రీన్ ఫీల్డ్ హైవే…
హైదరాబాద్ కేంద్రంగా తొలిసారి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి హెచ్ఎండీఏ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఎయిర్‌పోర్టు నుంచి ముచ్చెర్ల ఫార్మా సిటీ వరకు 40 కిలోమీటర్ల పొడవైన ఆరు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మిస్తోంది. ఇదీ అవుటర్ రింగు రోడ్డు నుంచి మొదలై ఫోర్త్ సిటీవరకు చేరనుండగా, అక్కడి నుంచి రీజనల్ రింగు రోడ్డు వరకు భవిష్యత్తులో విస్తరించేలా భూసేకరణ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని 21 గ్రామాల మీదుగా వెళ్లే ఈ హైవేను నిరసిస్తూ ఎంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న రోడ్లను విస్తరించకుండా… కొత్తగా గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం భూములు సేకరించడంపై ఆగ్రహంతో ఉన్నారు. ఫోర్త్ సిటీ పేరిట కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకుల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనువుగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం సాగుతుందనే ఆరోపణలు ఉండగా… ఇప్పటికీ అవుటర్ రింగు రోడ్డును ఆనుకుని ఉండే సర్వీసు రోడ్డు కనీస మరమ్మత్తులు కూడా చేయడం లేదని విమర్శలు కూడా ఉన్నాయి.