Phone Tapping Case | నాంపల్లి క్రిమినల్ కోర్టులు : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్బీఐ అధికారి రాధాకిషన్‌రావు శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. మద్యంతర బెయిల్‌పై విడుదలైన అదనపు ఎస్పీ భుజంగరావు కోర్టు ఎదుట హాజరయ్యారు. ఇద్దరు రూ.లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తులను 14వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ కోర్టుకు సమర్పించారు. రాధాకిషన్‌రావు, భుజంగరావు గతంలోనే పాస్‌పోర్టులను కోర్టుకు సమర్పించారు. ప్రతీ సోమవారం ఉదయం 11 గంటలకు పంజాగుట్ట పోలీసుల ఎదుట ఇద్దరు నిందితులు హాజరుకావాలని హైకోర్టు సూచించింది. ఎనిమిది వారాలపాటు పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరై విచారణాధికారికి సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
మీడియా సమావేశంలో పాల్గొని ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయరాదని చెప్పింది. సాక్షులతో పాటు వారి కుటుంబీకులను ప్రభావితం చేయొద్దని ఆదేశించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దుకు చర్యలు తీసుకునే అధికారం విచారణాధికారికి ఉందని తెలిపింది. ఇటీవల అదనపు ఎస్పీ తిరుపతన్న జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రణీత్‌రావు ఒక్కరే రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైలులో ఉన్నారు. హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ పెండింగ్‌లో ఉండడంతో ఆయన తరఫున బెయిల్ దాఖలు చేయలేదని సమాచారం. ఓ న్యూస్‌చానెల్ ప్రతినిధి శ్రావణ్‌కుమార్ తరఫున ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై తీర్పు వెలువరించనుంది.
తెలంగాణ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు ప్రాథమిక ఆధారాల ద్వారా తెలిసినట్టు అధికారులు తెలిపారు. ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్లుగా సమాచారంతో విచారణ చేపడుతున్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అధికారులు కేసు విచారణకు రంగం సిద్ధం చేశారు. జడ్జిలకు చెందిన ఫోన్ల ట్యాపింగ్ సమాచారాల్ని సేకరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తున్నది. సీజేగా ఉన్న వారి ఫోన్లు కూడా ట్యాపింగ్ బారినపడ్డట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తున్నది.