సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ప్రతిరోజు అర్ధరాత్రి కొత్త ఫోన్ నంబర్ నుంచి తన తోటి ఉపాధ్యాయురాలికి వాట్సాప్ మేసేజ్ చేస్తాడు.. బ్లూటిక్ రాగానే డిలీట్ చేస్తాడు. పగలు స్కూల్లో కలువగానే యథావిధిగా మాట్లాడుతున్నాడు. అతడి ప్రవర్తన, మాటల్లో తేడా గమనించిన ఉపాధ్యాయురాలు అతడి ఫోన్ చెక్ చేసింది.
తన అనుమానాలు నిజం కావడంతో రాచకొండ షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తోటి ఉపాధ్యాయుడే ఇదంతా చేస్తున్నాడని గుర్తించి అరెస్ట్ చేశారు. ఇలా ఒకటా రెండా వివిధ రకాల ఫిర్యాదులు అందుకున్న షీ టీమ్ పదిహేను రోజుల్లో 141 మందిని పట్టుకున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు.
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ షీ టీమ్స్ డెకాయి అపరేషన్లు చేస్తున్నాయని, మహిళలను వేధించే వారి చేష్టలను సాక్ష్యాధారాలతో వీడియో తీసి నిందితులను పట్టుకొని న్యాయస్థానాలలో హాజరుపరుస్తున్నారని వివరించారు. వేధింపులు భరించాల్సిన అవసరం లేదని.. ధైర్యంగా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.