సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ఏనుగు దంతాలు ఎలా తెచ్చారు? ఏనుగులను చంపేశారా? అనే విషయాలపై నిగ్గు తేల్చేందుకు రాచకొండ పోలీసులు శేషాచలం అడవులకు వెళ్లి విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏనుగు దంతాలను హైదరాబాద్‌లో విక్రయించేందుకు ఎర్ర చందనం స్మగ్లర్లు రేకులకుంట ప్రసాద్‌ను బుధవారం ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రూ.3కోట్ల విలువైన రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. శేషాచలం అడవుల్లోని గిరిజనుల నుంచి ఏనుగు దంతాలను తీసుకొచ్చినట్లు నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు.
అయితే ఏనుగులను చంపి ఆ తరువాత దంతాలను వేరు చేశారు. ఏనుగులు బతికుండగానే దంతాలు తీసుకున్నారు, దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? అనే విషయాలను తేల్చేందుకు మూలాల వరకు వెళ్లాలని రాచకొండ పోలీసులు నిర్ణయించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు లోకేశ్వర్‌రెడ్డి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఏపీ పోలీసులు కూడా రాచకొండ పోలీసులకు లేఖలు రాసి, సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఏనుగు దంతాలు కూడా స్మగ్లింగ్ చేస్తున్నారనే విషయం వెలుగులోకి రావడంతో అక్కడి పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.
ఏనుగు దంతాలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో స్మగ్లర్లు ఏనుగులను చంపేందుకు సైతం వెనుకాడకుండా దంతాలు సేకరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాచకొండ పోలీసులు బుధవారం 5.62 కిలోల బరువున్న రెండు దంతాలను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3కోట్లు ఉంటుందన్నారు. అలా మూడు, నాలుగు చేతులు మారిన తరువాత కీలక వ్యాపారుల వద్దకు దంతాలు చేరుకుంటాయి.
కొందరు ఏనుగు దంతాలను పూజ గదిలో ఉంచి పూజలు చేస్తే లక్ష్మి వస్తుందని భావిస్తుంటారు.. మరికొందరు ఆభరణాలు తయారు చేసుకుంటారు. ఏనుగు దంతాలతో తయారు చేసిన ఆభరణాలకు బంగారం, వజ్రాల కంటే ఎక్కువగా డిమాండ్ ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు ఏనుగు దంతాలను కోట్ల రూపాయలు వెచ్చించి కొంటూ ఒక్కో దంతంతో 100 వరకు చిన్న చిన్న ముక్కలు తయారు చేసి వాటితో ఆభరణాలు తయారు చేసి తమ కస్టమర్లకు అందిస్తున్న వాళ్లు ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
అప్పుడప్పుడు ఇలాంటి కేసులను ట్రై కమిషనరేట్ పోలీసులు ఛేదిస్తున్నారు. ఆయా కేసుల్లోని నిందితులకు తాజాగా రాచకొండ ఎస్ఓటీ పోలీసులకు పట్టుబడ్డ నిందితుడు, పరారీలో ఉన్న మరో నిందితుడికి ఏమైనా సంబంధాలున్నాయా? గతంలో ఎక్కడైనా పట్టుబడ్డారా? ఎవరికైనా గతంలో విక్రయించారా? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. పరారిలో ఉన్న మరో నిందితుడు లోకేశ్వర్‌రెడ్డికి ఆశ్రయమిస్తున్న వాళ్ల గూర్చి సైతం వాకబు చేస్తున్నారు. జైల్లో ప్రసాద్, లోకేశ్వర్‌రెడ్డిలు పరిచయం అయి ఏనుగు దంతాల స్మగ్లింగ్‌కు స్కెచ్ వేసిన విషయం తెలిసిందే.