సిటీబ్యూరో, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): పనిచేసే చోట లైంగిక వేధింపుల నివారణ, అంతర్గత ఫిర్యాదుల కమిటీపై రాచకొండ పోలీస్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన రాచకొండ సీపీ, సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ సుధీర్‌బాబు మాట్లాడుతూ.. మహిళలపై వివక్షను నిరోధించడం, బాధిత మహిళలు నాయకత్వం వహించడానికి సాధికారిత కల్పించడం, సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడానికి అవసరమైన చర్యల ప్రాముఖ్యత గూర్చి వివరించారు.
నిజమైన బాధితులకు పోలీసుల మద్దతు ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు. మహిళల భద్రతా విభాగం డీసీపీ ఉషా విశ్వనాథ్ మాట్లాడుతూ.. మహిళల భద్రతలో షీ బృందాలతో సహా మహిళా భద్రతా విభాగం బాధితులకు అండగా ఉంటుందన్నారు. మేడ్చల్‌లోని సఖీ వన్ స్టాప్ సెంటర్ ప్రతినిధి సాక్షి మాట్లాడుతూ.. ప్రివెన్షన్ ఆఫ్ సెక్యువల్ హరాస్మెంట్(పోష్) అండ్ ఇంటర్నరల్ కైంప్లెంట్స్ కమిటీ(ఐసీసీ) నియమనిబంధనల గూర్చి వివరించారు. ఈ సమావేశంలో ఉమెన్ ఫోరం జాయింట్ సెక్రటరీ డాక్టర్ రాధికనాత్, ఆర్కేఎస్సీ చీఫ్ కోఅర్డినేటర్ సావిత్రి తదితరులు హాజరయ్యారు.