సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సమాజంలో నేరాలు జరుగుతున్న తీరుపై పూర్తి అవగాహన ఉన్న పోలీసు అధికారులే సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కి మోసపోతున్నారు..మొన్న రాచకొండ సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ సైబర్‌నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన వెలుగులోకి రాగా… తాజాగా రాచకొండలో పనిచేస్తున్న మరో ఇన్స్పెక్టర్ స్టాక్ మార్కెట్లో అధిక లాభాలొస్తాయని నమ్మి సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కి రూ. 39 లక్షలు పోగొట్టుకున్నాడు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న బాధితుడు వనస్థలిపురం ప్రాంతంలో నివాసముంటున్నాడు. నవంబర్ 24న వాట్సాప్ కాల్ వచ్చింది. తాము స్టాక్ మార్కెట్లో మెలుకువలు చెప్పి, మీ పెట్టుబడులపై అధిక లాభాలు వచ్చే విధంగా చేస్తామంటూ ఫోన్లో సైబర్‌నేరగాళ్లు మాట్లాడారు. బాధితుడి ఫోన్ నెంబర్‌ను ‘స్పెషల్ ట్రైనింగ్ ప్రొగ్రాం, దేవా ఏ టీమ్ 13’ అనే వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. ఆ గ్రూప్‌లో 98 మంది సభ్యులున్నారు.
ఆ గ్రూప్‌లో ఎంఏవీఈఆర్ఐసీకెఎస్ ట్రేడింగ్ పేరుతో ఒక లింక్‌ను పంపించారు. ఆ లింక్‌ను క్లిక్ చేసి అందులో యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఆ గ్రూప్‌లో జరిగే సంభాషణలు మూడు రోజుల పాటు పరిశీలించాడు, ఆ గ్రూప్‌లో ఉన్న వాళ్లు తమకు భారీ లాభాలొచ్చాయంటూ కొన్ని స్క్రీన్ షాట్స్ పంపించారు. వాటిని చూసిన బాధితుడు ఇన్స్పెక్టర్ నిజమని నమ్మాడు. మొదట రూ. 50 వేలు, ఆ తరువాత రూ. 3 లక్షలు పెట్టుబడి పెడుతూ దఫ దఫాలుగా రూ. 39.37 లక్షలు పెట్టుబడి పెట్టి స్టాక్స్ కొన్నాడు. ఆయా పెట్టుబడులకు స్క్రీన్‌పై భారీగా లాభాలు చూపించాయి. తన అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించడంతో సాధ్యం కాలేదు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు ఆరా తీయడంతో ఇదంతా ఫేక్ అని గుర్తించి రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.