సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): వివిధ రకాల సమస్యలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో అధికారులు, సిబ్బంది సానుభూతితో వ్యవహరించాలని, వారి సమస్యను ఓపికగా విని స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి రాచకొండ సీపీ సుధీర్‌బాబు సూచించారు. కొత్త సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో సిబ్బంది నూతనోత్సాహంతో పనిచేయాలని సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. నేరెడ్‌మెట్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో డీసీపీల నుంచి ఇన్స్పెక్టర్ స్థాయిలో అధికారుల వరకు, మినిస్టీరియల్ స్టాఫ్‌తో కలిసి సోమవారం నూతన సంవత్సరం వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి వరకు అందరు నూతన క్రిమినల్ చట్టాల గూర్చి సంపూర్ణ పరిజ్ఞానం కల్గి ఉండాలని, నూతన చట్టాల అమలులలో ఎదురవుతున్న అవరోధాలను ఎప్పకటిప్పుడు ఉన్నతాధికారులకు తెలుపాలని వివరించారు. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థలు, పంచాయితీలకు ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వారి వారి పరిధిలో తగిన ముందస్తు జాగ్రత్తలు మొదలు పెట్టాని ఆదేశించారు. అనంతరం రాచకొండ కమిషనరేట్‌కు చెందిన అంబర్‌పేట్‌లోని కార్ హెడ్ క్వార్టర్స్‌లోను జరిగిన వేడుకలలో సీపీ సుధీర్‌బాబు పాల్గొన్నారు.