రవీంద్రభారతి, నవంబర్ 23 : కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పిస్తామని ఆశలు రేపి, ఇప్పుడు 46 జీవోను జారీ చేసి ,పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్తామని బీసీ ద్రోహి సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం పచ్చిమోసమని బీసీ జాక్ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ఆదివారం బషీర్‌బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం ఎదుట బీసీ నాయకులతో కలిసి ఆర్.కృష్ణయ్య జీవో 46 ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సమాజమంతా ఏకమై ఈ దగాకోరు ప్రభుత్వాన్ని కూలగొట్టడం ఖాయమని ఆయన ధ్వజమెత్తారు.
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాలించిన కాంగ్రెస్‌పార్టీ ఏనాడు బీసీలకు న్యాయం చేయలేదని, కనీసం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టలేదని ఆయన విమర్శించారు. దేశంలో 60 శాతం ఉన్న బీసీలకు ఇప్పటి వరకు సామాజిక న్యాయం చేయలేదని చెప్పారు. ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతబట్టుకుని దేశంలో ఎవ్వరి వాటా ఎంతో దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని ఊకదంపుడు మాటలు మాట్లాడుతున్నాడే తప్ప తెలంగాణలో ఇచ్చిన హామీ నెరవేర్చకుండా బీసీలను దగా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించిందని అబద్ధపు ప్రచారం చేశారని చెప్పారు. ఇలా అబద్దపు పునాదుల మీద బీసీలను ఎన్ని రోజులు మోసం చేస్తారని, బీసీలు ఇక సహించరని, కాంగ్రెస్ ప్రభుత్వంపై మిలిటెంట్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం 46ను వెంటనే ఉపసంహరించి, 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని, లేకుంటే అన్ని పార్టీలతో కలిసి ఎన్నికలను బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు నీల వెంకటేశ్, సి.రాజేందర్, రాజ్‌కుమార్, బీంరాజు, పగిళ్ల సతీష్, అనంతయ్య, భూమన్నగౌడ్, అజయ్‌కుమార్‌గౌడ్, రాజుగౌడ్, రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్, నవంబర్ 23: బీసీలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 42 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ పలు బీసీ సంఘాలు జీవో నెంబర్ 46 ప్రతులను దగ్దం చేశాయి. విద్యానగర్ చౌరస్తాలో 46 జీవో ప్రతులను దగ్ధంం చేసిన నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ గత రెండేళ్లుగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి, నేడు బీసీలను మోసం చేసిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు బీసీలకు ద్రోహం చేస్తూ 46 జీవో జారీ చేసి గొంతు కోశారని మండిపడ్డారు. రాష్ట్రంలోని 2కోట్లమంది బీసీలకు అన్యాయం చేశారని, 46 జీవో వెంటనే ఉపసంహరించుకోకపోతే బీసీల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు ఉండవని, అయినా కాంగ్రెస్ పార్టీ ఎలా 42 శాతం ఇస్తుందని ప్రశ్నించారు. రిజర్వేషన్ల కేసు విషయంలో బలమైన పునాదులు ఉన్నాయని, రాజ్యాంగబద్దంగా, న్యాయబద్దంగా, చట్టబద్దంగా ఉండి జనాభా లెక్కలతో కేసు గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయన్నారు. బిహార్ ఎన్నికలు పూర్తవగానే కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందన్నారు.
42 శాతం రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం ఏముందని, హైకోర్టులో కేసు నడుస్తుండగా, తీర్పు రాకుండానే అగమేఘాల మీద ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ది ఉంటే అఖిల పక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు డాక్టర్ రిషి అరుణ్‌కుమార్, నాగేశ్వరరావు, భూమన్న, రాజుగౌడ్, వీరస్వామి, శ్రీనివాసరావు, గువ్వల సత్యం, వీరబాబు, రమేష్, అల్లా రామారావు పాల్గొన్నారు.
అంబర్‌పేట, నవంబర్ 23:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 46 తీసుకొచ్చి బీసీలను మోసం చేసిందని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబర్‌పేట శ్రీరమణ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద జేఏసీ నాయకులు పగిళ్ల సతీష్, అనంతయ్యల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రతులను దగ్ధం చేసి మాట్లాడారు.
రవీంద్రభారతి, నవంబర్ 23: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తానని ఏతులు కొట్టిన సీఎం రేవంత్‌రెడ్డి బీసీల చెవ్వులో బీడి పెట్టి 46 జీవోను తీసుకొచ్చి పాత పద్ధతితోనే పంచాయతీ ఎన్నికలకు వెళుతామని మంత్రివర్గ సమావేశంలో ప్రకటించడం సిగ్గుచేటని, సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ర్టాన్ని పాలించే నైతిక అర్హతలేదని, తక్షణమే సీఎం రాజీనామా చేసి బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశ్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓరుగంటి వెంకటేశ్‌గౌడ్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి పెద్ద కుట్రదారుడు, ఇప్పటి వరకు అఖిలపక్షాన్ని ఎందుకు ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లడంలేదని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి కొన్ని తోక బీసీ సంఘాలతో కలిసి ఢిల్లీలో రెండు రోజులు హడాహుడి చేసి చేతులు దులుపుకున్నారని, రేవంత్‌రెడ్డికి బీసీలపై ఏమాత్రం ప్రేమలేదన్నారు. జరగబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపైన తిరుగుబడాలని ఆయన బీసీలకు పిలుపునిచ్చారు. హైకోర్టు వాదనలు వినకుండానే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను పూర్తిగా మోసం చేసిందని కోలా జనార్దన్ విమర్శించారు. ఈ సమావేశంలో బీసీ డెమొక్రటిక్ జేఏసీ కన్వీనర్ సంగమేశ్వర్రావు, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు చిన్న రాములు, బీరకాయల మధుసూదన్, బీసీ సంఘాల జేఏసీ మహిళా అధ్యక్షురాలు సారంగ అనితాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి రెండేళ్లు కాలయాపన చేసి బీసీల చెవిలో పూలు పెట్టి ఇప్పుడు పాత పద్ధతితోనే ఎన్నికలకు వెళ్తామని 46 జీవోను తీసుకురావం బీసీలను దగా చేయడమేనని, సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ ప్రజలను పరిపాలించే నైతిక హక్కులేదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో పలుచోట్ల చెవిలో పూలు పెట్టుకొని, నల్లబ్యాడ్జిలు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌పార్టీ మోసం చేస్తూనే ఉందని ఆయన ధ్వజమెత్తారు. 62 శాతం ఉన్న బీసీలను మోసం చేస్తూ 3, 4 శాతం లేని రెండ్లు తెలంగాణ రాష్ర్టాన్ని, అగ్రకుల పార్టీలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయని, బీసీలను ఓటుబ్యాంకుగా ఉపయోగించుకుంటున్నాయని చెప్పారు. ఇప్పటికైనా 46జీవోను ఉపసంహరించుకొని 42 శాతం కల్పించిన తరువాతే ఎన్నికలకు వెళ్లాలని, లేకుంటే గ్రామాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులను తిరుగనివ్వమని హెచ్చరించారు.
అంబర్‌పేట, నవంబర్ 23:కాంగ్రెస్, బీజేపీల చీకటి ఒప్పందంలో భాగంగానే జీవో నెంబర్ 46ను ఆగమేఘాల మీద ప్రభుత్వం తీసుకొచ్చిందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అధికశాతం రెడ్లను సర్పంచులుగా చేయడం కోసమే అగ్రకుల నాయకులు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 46ను నిరసిస్తూ అంబర్‌పేట అలీకేఫ్ చౌరస్తా జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జీవో కాపీలను చించివేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 46తో బీసీలకు కేవలం 18 శాతం రిజర్వేషన్లు మాత్రమే వర్తిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను రాజకీయ సమాధి చేయడం కోసం రాత్రికి రాత్రే జీవోను తెచ్చాయన్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోతుందని ప్రశ్నించారు. జీవో నెంబర్ 9 రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు బీసీ సమాజం సంతోషం వ్యక్తం చేసిందని, 46తో తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 46 జీవోను రద్దు చేసేవరకు ప్రభుత్వంపై బీసీల పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో కో-చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, నాయకులు కనకాల శ్యామ్, విక్రమ్‌గౌడ్, జాజుల లింగంగౌడ్, నందగోపాల్, బొల్లెపల్లి స్వామిగౌడ్, ఉదయ్‌కుమార్ నేత తదితరులు పాల్గొన్నారు.
తెలుగు యూనివర్శిటీ, నవంబర్ 23: జీవోలు, ఆర్డినెన్స్, అసెంబ్లీ తీర్మానాల పేరుతో కాలయాపన చేసి మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గొంతు కోసిందని బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ విమర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం గన్‌పార్క్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ జీవో 46తో ఎన్నికలకు వెళ్లడం బీసీలను వంచించడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసి బీసీ ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసి ఐక్య సంఘటనగా ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు. బీసీలను బిక్షగాళ్లు కాదని, కాంగ్రెస్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.దుర్గయ్య గౌడ్, బోయ గోపి, బైరు శేఖర్ గంగపుత్ర, అంబాల నారాయణ గౌడ్, ఎలికట్టె విజయ్‌కుమార్ గౌడ్, పాలకూరి అశోక్, అవ్వారు వేణు, చెన్న శ్రీకాంత్ నేత, దామోదర్ గౌడ్, ఎర్రమాదు వెంకన్న నేత, లింగేశ్ యాదవ్, మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.