ఖైరతాబాద్, ఆగస్టు 16 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) స్ఫూర్తితో కులగణన(Caste census), 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ దీక్ష చేపడుతామని బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ కుల, విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R.Krishnaiah) హాజరై మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల సీట్ల కేటాయింపుల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కనీసం బీసీలకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటీసీ అయ్యే అర్హత కూడా లేదా అని ప్రశ్నించారు.
కులగణన చేయకుండా ప్రభుత్వం సాకులు చెబితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. బీసీల విశ్వసనీయత కోల్పోకముందే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే కులగణన చేసి, 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. తన ఆరోగ్యం భాగా లేకుండా సామూహిక ఆమరణ దీక్షలో పాల్గొంటానని స్పష్టం చేశారు. అధికార పార్టీలో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు సమగ్ర కులగణనపై ఆయా పార్టీలపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. కుల సంఘాలు పార్టీలకు అతీతంగా తెగించి పోరాడాలన్నారు.