కవాడిగూడ, జనవరి 20 : తెలంగాణ కళాకారులు రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అన్నారు. అర్హులైన కళాకారులకు సాంస్కృతిక సారథిలో తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ కారుల సంఘం అధ్యక్షుడు దరువు అంజన్న ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని మంగళవారం ఇందిరాపార్కు వద్ద పోరు దీక్ష చేపట్టారు.
ఈ దీక్షా కార్యక్రమంలో ఆర్.కష్ణయ్య, బీసీ జేఏసీ చైర్మన్ జూజుల శ్రీనివాస్‌గౌడ్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమల, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌లు హాజరై మద్దతు ప్రకటించారు. అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సారథిలో వెయ్యి ఉద్యోగాలు సాధించుకునే దిశగా కళాకారులు పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ కళాకారులకు వెంటనే ఉద్యోగాలు కల్పించి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు మోహన్ బైరాగి, రవికుమార్, కిరణ్, ఆరువురి వెంకన్న, తాడూరి శ్రీకాంత్, వెంకటాచారి, రామలింగం, చుక్కరామనర్సయ్య, పుష్పలత, శంకరమ్మ, కవిత, నర్మద, రమ, తదితర కళాకారులు పాల్గొన్నారు.