బంజారాహిల్స్: రానున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడమే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు నిజమైన నివాళి అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బోరబండ డివిజన్‌కు చెందిన ముఖ్యనాయకుల సమావేశంలో ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
జూలై 27న బోరబండ సైట్-4, 5 కాలనీలోని పీజేఆర్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాపసభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కోరారు. తనతో పాటు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ తనకు ఎంతో సన్నిహితుడన్నారు. ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకే కాకుండా వ్యక్తిగతంగా తనకు ఎంతో లోటన్నారు.
మాగంటి అకాల మరణంతో త్వరలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రానుందని, ఆ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో గులాబీ జెండా ఎగురవేయడమే మాగంటికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మాగంటి గోపీనాథ్ ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు సాగిస్తున్న అరాచకాలను ప్రజలంతా గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నారన్నారు. సమావేశంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతా గోపీనాథ్, కార్పొరేటర్ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.