Musi Development | సిటీబ్యూరో, జూలై 21(నమస్తే తెలంగాణ) : మూసీ సుందరీకరణ అంశం సోషల్ మీడియాలో జోరు చర్చకు దారితీసింది. అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి మూసీని రూ. 50వేల కోట్లతో లండన్‌లోని థేమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామంటూ చెప్పగా.. మూడు నెలల్లోనే అంచనా వ్యయం ఏకంగా రూ. లక్ష కోట్లకు పెరగడం చర్చకు దారితీసింది.
శనివారం గోపన్‌పల్లిలో జరిగిన ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో మూసీకి ఐదేండ్లలో రూ. లక్షన్నర కోట్లు ఖర్చుపెట్టి ఊపిరిపోస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన మాటలపై నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎలాంటి మాస్టర్ ప్లాన్ లేకుండా, ప్రాజెక్టు రిపోర్టులు తయారు కాకుండానే అంచనా వ్యయం పేరిట లక్షల కోట్లకు పెంచేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
మూసీ సుందరీకరణపై సోషల్ మీడియాలో పెద్ద చర్చనే జరుగుతుండగా, శాస్త్రీయమైన విధివిధానాలు లేకుండా అంచనా వ్యయం ఎలా పెరుగుతుందని, ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలను ఎత్తిచూపుతున్నారు. సోషల్ మీడియా యుగంలో వ్యాఖ్యల వెనుక అసలు మతలబు క్షణాల్లో బట్టబయలు అవుతుంది.
తప్పొప్పులను ఎత్తిచూపుతున్నారు. ఇదే విషయంలో ఎక్స్ వేదికగా వివరణాత్మకమైన చర్చలతో అసలు విషయాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ప్రారంభానికి ముందే మూడింతలు పెరిగితే… ఇక ప్రాజెక్టు కార్యారూపంలో వచ్చి పూర్తయ్యే లోపు ఎంత ఖర్చు చేస్తారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

సీఎం కామెంట్లపై వాట్సాప్ గ్రూపుల్లోనూ చర్చ…
మూసీ సుందరీకరణ చేపట్టాల్సిన ప్రాజెక్టు కానీ కార్యాచరణ, ప్రణాళిక లేకుండా పోతే లక్షల కోట్ల ప్రజాధనం వృథా అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో శాస్త్రీయ, వాస్తవిక అంశాలను ప్రస్తావించాల్సిన ప్రభుత్వమే ఈ తరహా తాడు, బొంగరం లేని మాటలతో జనాలను అయోమయానికి గురి చేస్తున్నారంటూ నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా దాటి ఇంటర్నల్ వాట్సాప్ గ్రూపులోనూ సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.
తాజాగా, మేడ్చల్ వరకు మెట్రో విస్తరణపై పెదవి విప్పని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న మాటలను అభిప్రాయ సేకరణ చేస్తుండగా, జనాల జీవన ప్రమాణాలు, మౌలిక, రవాణా సదుపాయాలను మెరుగుపరిచే అభివృద్ధి కార్యక్రమాలను ఆచరణలో పెట్టాలని, ఇలాంటి అభూత కల్పనలతో ప్రజాధనం వృథా అవుతుందని అభిప్రాయపడుతున్నారు. పలు వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజానిజాలను తేల్చాలంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.