Python | హైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాములు, కొండచిలువలు, మొసళ్లు జనావాసాల్లోకి ప్రవేశించి, భయాందోళనకు గురి చేస్తున్నాయి. మొన్నటి వరకు మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలకు మొసళ్లు, కొండచిలువలు కంటి మీద కునుకు లేకుండా చేశాయి.
తాజాగా మియాపూర్ పరిధిలోని బాచుపల్లిలో ఓ కొండచిలువ కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్మెంట్ రెండో అంతస్తులో కొండచిలువ ప్రత్యక్షమైంది. అపార్ట్మెంట్ వాసులు కొండచిలువను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తక్షణమే అటవీ శాఖ అధికారులకు సమాచారంం అందించారు. వాలంటీర్లు ఘటనాస్థలానికి చేరుకుని, కొండచిలువను బంధించారు. అనంతరం అడవిలో వదిలేశారు.
కొండచిలువను బంధించడంతో అపార్ట్మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఏరియాలో ఉన్న అడవుల నుంచి కొండచిలువ జనవాసాల్లోకి వచ్చి ఉండొచ్చని అధికారులు పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను ఒంటరిగా బయటకు పంపొద్దని హెచ్చరించారు.