కేపీహెచ్‌బీ కాలనీ, జనవరి 2: జీహెచ్ఎంసీ స్టడీ టూర్ పేరుతో సర్కార్ పదికోట్ల రూపాయాల ప్రజాధనం వృథా చేస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. సోమవారం క్యాంప్ ఆఫీస్‌లో బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మరో నెల రోజుల్లో కార్పొరేటర్ల పదివీకాలం ముగుస్తుందని, ఈ సమయంలో 10 కోట్లు ఖర్చుచేస్తూ స్టడీ టూర్ పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ నియోజకవర్గంలో కనీసం ఒక్క అభివృద్ధి పనికి శంకుస్థాపన చేయలేకపోయిందని విమర్శించారు. కేపీహెచ్‌బీ కాలనీ, పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ భూములను అమ్మి దాదాపు 2వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం తీసుకెళ్లిందని, దానిలో పదిశాతం(2 కోట్లు) కూడా కూకట్పల్లి అభివృద్ధికి కేటాయించకపోవడం బాధాకరన్నారు. గత ప్రభుత్వ హాయంలో నిధులు కేటాయించిన ఫతేనగర్ బ్రిడ్జ్జి, బాలానగర్ అండర్‌పాస్ పనులను కూడా ప్రస్తుత ప్రభుత్వం చేయడం లేదన్నారు. మూడు కమిషనరేట్లు ఏర్పాటు చేసి కూకట్‌పల్లిని మూడు ముక్కలు చేశారని విమర్శించారు.
రేవంత్‌రెడ్డిది రాక్షస పాలన…
కూకట్‌పల్లిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు బ్యానర్లు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకోవడం లేదని.. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు బ్యానర్లు ఏర్పాటుచేసిన వెంటనే వాటిని తొలగిస్తున్నారని, ఇలాంటి రాక్షస పాలన జీవితంలో చూడలేదని ఎమ్మెల్యే మాధవరం అన్నారు. బ్యానర్ల ఏర్పాటులో అన్ని రాజకీయ పార్టీలకు ఒకే చట్టం ఉండాలన్నారు. నల్లచెరువును అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న హైడ్రా… భారీ వర్షం పడితే కిందికి నీళ్లు వెళ్లే పరిస్థితి లేదన్నారు. వర్షంనీటి కాలువలను అభివృద్ధి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తోందన్నారు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తచెదారం కనిపిస్తుందని, దోమలతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో స్వచ్ఛ హైదరాబాద్ కోసం స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తెచ్చామని, నేడు సరిపడా పారిశుధ్య కార్మికులు కూడా లేకపోవడం బాధాకరమన్నారు.
రూ 2 కోట్లు ఇస్తామని మోసం…
జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి కార్పొరేటర్‌కు డివిజన్ అభివృద్ధి కోసం రూ.2 కోట్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని విమర్శించారు. కాలనీలు, బస్తీలలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, జిల్లా మంత్రి శ్రీధర్‌బాబును పలుమార్లు కలిసినా ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన సర్కార్… జీహెచ్ఎంసీ కాలపరిమితి ముగుస్తున్న వేళ… స్టడీ టూర్ పేరుతో విహారయాత్రను ఏర్పాటు చేసిందని విమర్శించారు. ప్రజాధనం వృథా చేయడం ఇష్టంలేక.. ఈ టూర్‌ను బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు బాయ్‌కాట్ చేస్తున్నట్లు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు జనవరి 20 నుంచి పాదయాత్ర చేయనున్నట్లు మాధవరం తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముద్దం నర్సింహయాదవ్, ఆవుల రవీందర్‌రెడ్డి, మందాడి శ్రీనివాస్‌రావు, జూపల్లి సత్యనారాయణ, పగుడాల శిరీషాబాబురావు, పండాల సతీష్‌గౌడ్, సబిహాబేగం, మహేశ్వరి శ్రీహరి, మాజీ కార్పొరేటర్లు తూము శ్రావణ్‌కుమార్, పగుడాల బాబురావు, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు గౌసుద్దీన్, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.