Hyderabad | పదేండ్లుగా ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరం.. ప్రజా పాలనలో నిరసనలు.. ఆందోళనలతో అట్టుడుకుతున్నది. నగరంలో పరిస్థితులు చూస్తుంటే.. శాంతి భద్రతలు గాడితప్పుతున్నాయా అనే అనుమానం కలుగుతున్నది. ముఖ్యంగా గ్రూప్-1 పరీక్షలపై కాంగ్రెస్ సర్కారు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో నిరుద్యోగులు గత కొన్ని రోజులుగా రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా.. సర్కారు పట్టించుకోవడం లేదు. అరెస్టులు, నిర్బంధాలతో కట్టడి చేసేందుకు యత్నిస్తున్నది. జీవో నం. 29ను రద్దు చేయాలని, ఈనెల 21 నుంచి జరగనున్న గ్రూప్-1 మెయిన్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలంటూ.. శనివారం సైతం నిరుద్యోగులు నిరసన గళాన్ని వినిపించారు. ‘చలో సచివాలయం’కు ర్యాలీగా వెళ్లగా, పోలీసులు అభ్యర్థులపై జులుం ప్రదర్శించారు.
మరోవైపు కుమ్మరిగూడ దేవాలయం పై జరిగిన దాడిని నిరసిస్తూ హిందూ ధార్మిక సంఘాలు ఇచ్చిన ‘సికింద్రాబాద్ బంద్’ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనకారుల ఆందోళనలు, రాళ్ల దాడికి ప్రతిగా పోలీసులు జరిపిన లాఠీచార్జిలో పలువురు పోలీసులు, నిరసనకారులకు గాయాలయ్యాయి.
-సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ)
గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసుల దమనకాండ కొనసాగుతూనే ఉన్నది. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్న వారిపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి హిమాయత్‌నగర్, అశోక్‌నగర్ ప్రాంతాలు గ్రూప్-1 అభ్యర్థులు చేపడుతున్న నిరసనలతో హోరెత్తిపోతున్నాయి. శనివారం అభ్యర్థులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు, ‘చలో సచివాలయం’.. కుమ్మరిగూడ దేవాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ… హిందూ ధార్మిక సంఘాలు ఇచ్చిన ‘సికింద్రాబాద్ బంద్’ ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతతకు దారితీశాయి.
కాగా, గడిచిన రెండు మూడు రోజుల నుంచి అశోక్‌నగర్‌లో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. నిరుద్యోగులపై పోలీసుల లాఠీచార్జి, నిరసనకారుల ప్రతిఘటనతో ఆ ప్రాంతం దద్దరిల్లుతున్నది. స్థానికంగా పోటీ పరీక్షలకు సంబంధించిన కోచింగ్ సెంటర్లు అధికంగా ఉండటంతో గ్రూప్-1 తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులంతా అశోక్‌నగర్, దాని పరిసర ప్రాంతాల్లోని హాస్టళ్లలోనే బస చేస్తుంటారు. అయితే జీవో నం. 29ను రద్దు చేశాకే.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలంటూ.. కొన్ని రోజులుగా అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
వీరి వినతిని పట్టించుకోని రేవంత్ సర్కార్ ఈనెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవ్వడమే కాకుండా హాల్ టికెట్లను సైతం జారీ చేసింది. దీంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు. ఐదు రోజులుగా అశోక్‌నగర్ కేంద్రంగా సాగుతున్న అభ్యర్థుల ఆందోళనలు శనివారం సచివాలయానికి చేరుకున్నాయి. పోలీసు బలగాలతో నిలువరించే ప్రయత్నాలను నిరుద్యోగులు పటాపంచలు చేస్తూ సచివాలయానికి దూసుకుపోయారు. అశోక్‌నగర్ టు సెక్రటేరియట్ వరకు చేరుకున్నారు. దీంతో సచివాలయం చుట్టూ పోలీసు బలగాలతో ప్రభుత్వం అష్ట దిగ్భందనం చేసింది. వందలాది మంది సెక్రటేరియట్ వరకు వచ్చిన ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు.
పోలీసుల దమనకాండ దేవాలయంపై దాడిని నిరసిస్తూ..
సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయం పై జరిగిన దాడిని నిరసిస్తూ హిందూ ధార్మిక సంఘాలు ఇచ్చిన సికింద్రాబాద్ బంద్ పిలుపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనకారుల ఆందోళనలు, రాళ్ల దాడికి ప్రతీగా పోలీసులు జరిపిన లాఠీ చార్జిలో పలువురు పోలీసులకు, నిరసనకారులకు గాయాలయ్యాయి. సికింద్రాబాద్ మహంకాళీ ఆలయం నుంచి ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ర్యాలీ మోండా మార్కెట్, అల్ఫా హోటల్, రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయానికి మధ్యాహ్నం చేరుకుంది.
పెద్ద ఎత్తున నిరసనకారులు ఆలయ ముందు కూర్చోని ఆందోళన చేశారు. పోలీసులకు నిరసన కారులకు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పలువురు పోలీసుల పై రాళ్లు, చెప్పులను విసిరారు. పరిస్థితి చేజారిపోతుందని భావించిన పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. పోలీసులు నిరసన కారులను అడ్డుకునే ప్రయత్నంలో పలువురు పోలీసులకు, నిరసన కారులకు గాయాలయ్యాయి. నగరంలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే శాంతిభద్రతలు గాడితప్పుతున్నాయా అనే అనుమానం కలుగుతున్నది. పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది.