ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 10: రాష్ట్రంలోని విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నెలకొల్పామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. ఓయూలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. ఓయూ విద్యార్థుల పోరాటాలతోనే తెలంగాణ కల సాకారమైందని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఓయూ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తనకు ఇంగ్లీష్ రాదని కొంతమంది అనుకుంటున్నారని, కానీ చైనా, జపాన్, జర్మనీ దేశాలకు చెందినవారికి కూడా ఇంగ్లీష్ రాదని, ఆ దేశాలు ప్రపంచాన్ని ఏలుతున్నాయని సీఎం అన్నారు. అక్కడి వారికి అసలు ఏబీసీడీలు కూడా రావన్నారు. ఇంగ్ల్లిష్ మాట్లాడే అమెరికాకు చైనా నుంచి ఉత్పత్తులు నిలిపివేస్తే గంట పాటు కూడా అమెరికా బతకలేదని చెప్పారు. యువమిత్రులు ఇంగ్లిష్ రాదనే విషయం మనసులో పెట్టుకోవద్దని సూచించారు. మనకు మానవత్వం, మనసు ఉంటే చాలన్నారు. ఇంగ్లీష్ రాకున్నా రెండేళ్ల నుంచి రాష్ర్టాన్ని మంచిగా పాలించడం లేదా అని ప్రశ్నించారు. అవసరమైతే ఇంగ్ల్లిష్ వచ్చినవారిని పది మందిని ఉద్యోగులుగా పెట్టుకుని, వాళ్లతో మాట్లాడించవచ్చని చెప్పారు.
ఓయూ వేదికగా జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భజనకే ఓయూ అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. వర్సిటీలో నెలకొన్న సమస్యలపై ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ముందుగా తొమ్మిది గంటలకు సభ ఉంటుందని ప్రకటించిన అధికారులు తరువాత పదకొండు గంటలకు వాయిదా పడినట్లు ప్రకటించారు. తీరా సభ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైంది. రేవంత్ భజనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన అధికారులు సభకు హాజరైన వారికి కనీస వసతులు కల్పించడం మరిచారు.
కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడంతో సభకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ ముందస్తుగా సిద్ధం చేసుకున్న ప్రసంగాన్ని చూసి చదువుతూ పలుమార్లు తడబాటుకు గురవడంతో వేదికపై ఉన్నవారితో పాటు వేదిక ముందు ఉన్న అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు నవ్వుల్లో మునిగిపోయారు. సభ జరిగే సమయంలో విద్యార్థులు సీఎం ప్రసంగానికి పదే పదే అడ్డుపడేందుకు యత్నించారు.