ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రెండో రోజు ఆదివారం కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగించారు. రాజకీయాల్లో సంస్కారవంతమైన భాష మాట్లాడాలని, నోటికి ఏది వస్తే అది మాట్లాడితే.. సహించబోమని హెచ్చరించారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు అంబర్‌పేట, కాచిగూడ పోలీస్స్టేషన్లలో బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలంటూ.. బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. చిత్రంలో ఎల్బీనగర్ చౌరస్తాలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తదితరులు.
ఎంపీ రంజిత్‌రెడ్డి
మాదాపూర్, మార్చి 12: తెలంగాణలో బీజేపీకి రోజురోజుకు ఆదరణ తగ్గడంతో తట్టుకోలేక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని చేవెళ్ల ఎంపీ, డాక్టర్ రంజిత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్లతో పాటు పార్టీ నాయకులు, మహిళలు మాదాపూర్‌లోని సాయినగర్ కాలనీలో ఆదివారం ధర్నా చేపట్టారు. అనంతరం పార్టీ మహిళాశ్రేణులు బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ… బండి సంజయ్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకొని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం అండదండలు చూసుకొని నోటికొచ్చింది మాట్లాడితే చూస్తు ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడమే ఆయన పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే ఇంటిని ముట్టడిస్తామన్నారు. నోటికి వచ్చిందల్లా మాట్లాడితే తెలంగాణలో ఎక్కడ కూడా తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
మన్సూరాబాద్, మార్చి 12: ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు భవిష్యత్తులో మహిళలే తగినరీతిలో గుణపాఠం చెబుతారని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ అధ్యక్షుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై, బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… బండి సంజయ్‌కు సంస్కారం లేదని, మహిళా ప్రజా ప్రతినిధులను అవమానపరుస్తున్నాడని అన్నారు. రాజకీయాల్లో సంస్కారవంతమైన భాష మాట్లాడాలే కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడితే సహించరన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను గౌరవించుకోవాలని బీజేపీ నాయకులు ప్రసంగాలు ఊదరగొట్టారని… కానీ నిజంగా వారికి మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేదని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతుందన్నారు. దర్యాప్తు సంస్థలకు సహకారం అందిస్తాం.. చట్టాలను గౌరవిస్తామని.. తప్పు చేస్తే తమ పై కేసులు నమోదు చేసుకోండి అని ధైర్యంగా ఢిల్లీకి వెళ్లి దర్యాప్తు సంస్థలకు సహకరించిన ఎమ్మెల్సీ కవితకు పూర్తి మద్దతు పలుకుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త, హస్తినాపురం కార్పొరేటర్ సుజాతనాయక్, మాజీ కార్పొరేటర్లు విఠల్‌రెడ్డి, శ్రీనివాసరావు, భవానీ ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి, జీవీ సాగర్‌రెడ్డి, వివిధ డివిజన్ల బీఆర్ఎస్ అధ్యక్షులు మల్లారెడ్డి, చిరంజీవి, వరప్రసాద్ రెడ్డి, రవికుమార్, అరవింద్‌రెడ్డి, మహేశ్‌యాదవ్, రాజిరెడ్డి, నాయకులు మధుసూదన్‌రెడ్డి, విశ్వేశ్వర్రావు, వెంకటేశ్, మహేశ్, అంజలి, శ్వేత, ప్రమీల, సువర్ణ, ఆదిలక్ష్మి, లత, లక్ష్మీప్రసన్న, మల్లిక, నాగలక్ష్మి, అనసూయ, ఉష, ఎల్.లక్ష్మి, సరోజ, రమాదేవి, కవిత, నాగమణి, రంగేశ్వరి పాల్గొన్నారు.
గోల్నాక : ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ కె.పద్మావతి డీపీరెడ్డి అంబర్‌పేట పోలీస్స్టేషన్లోఆదివారం ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు డాక్టర్ సులోచన, స్వరూప, స్రవంతి, నిర్మల, వాణి, శ్రీనివాస్‌యాదవ్,ఆబీబీ,విజయ్ ఉన్నారు.
కాచిగూడ : ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాచిగూడ బీఆర్ఎస్ నాయకులు ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు భీష్మాదేవ్, ధాత్రిక్ నాగేందర్బాబ్జీ, కె.సదానంద్, పాండురంగ, మహేశ్‌కుమార్, శేషు, ఎల్.రమేశ్, బబ్లూ, ఆంటోని, మహేశ్ , రాజేశ్ పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్
మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 12: జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ఎంపీ బండి సంజయ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మహిళలను అవమానించిన సంజయ్‌ను వెంటనే బీజేపీ నుంచి బహిష్కరించి, మహిళలను గౌరవించే పార్టీగా నిరూపించుకోవాలని ఆ పార్టీ నేతలకు సూచించారు. లేని పక్షంలో మహిళలను కించపరిచే పార్టీగా బీజేపీని భావించాల్సి వస్తుందన్నారు. గవర్నర్ ఈ ఘటనపై మాట్లాడకపోవడం బాధాకరమని తెలిపారు. మహిళను అవమానించారని ఫిర్యాదు చేయడానికి వెళ్తే మహిళా ప్రజాప్రతినిధులను సైతం లోనికి రానివ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంజయ్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, త్వరలోనే బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మోదీ నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే ప్రజలు బీజేపీకి ఓటుతో గుణపాఠం చెప్పి బీఆర్ఎస్ను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకనైనా ఒంటెత్తు పోకడలు మానుకొని తక్షణమే క్షమాపణలు చెప్పాలని హితవు పలికారు.