Hyderabad | మెహిదీపట్నం, ఆగస్టు 7: ప్రభుత్వ భూములను కాపాడటంలో అధికారులు విఫలమవుతున్నారు. గుడిమల్కాపూర్ గ్రామం, లక్ష్మీనగర్ ఖాదర్‌బాగ్‌లోని సర్వే నంబర్ 281లో ఉన్న 16 గుంటల ప్రభుత్వ బావి (జీవెల్) స్థలం కబ్జాకు గురైంది. ఆ స్థలం ప్రస్తుత మార్కెట్ ధర దాదాపు రూ. 30 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పటికే 1,936 గజాల బావి స్థలం కబ్జాకు గురైనా.. రెవెన్యూ అధికారులు అటువైపు తిరిగి చూడలేదు.
ఇదిలా ఉండగా.. ఆసిఫ్‌నగర్ మండల తహసీల్దార్ జ్యోతి నేతృత్వంలో అధికారులు బుధవారం సందర్శించారు. అక్కడ కొందరు చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు జేసీబీ తీసుకురావడంతో ఉద్రిక్తత నెలకొన్నది. అక్కడ సుమారు నాలుగు అంతస్తుల భవనాన్ని యథేచ్ఛగా నిర్మిస్తున్నారు. ఈ భవనం మొదటి అంతస్తు పనులు చురుకుగా సాగుతున్నాయి. నిర్మాణంలో ఉన్న ఆ భవనాన్ని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించగా..
ఆ భవనం నిర్మిస్తున్న వ్యక్తికి సంబంధించిన కొందరు అక్కడికి వచ్చి అధికారులను అడ్డుకున్నారు. ఆక్రమణదారులు పనులు చేయకుండా అడ్డుకోవడంతో రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టకుండానే.. అక్కడి నుంచి వెనుదిరిగారు. ప్రభుత్వ భూమి మొత్తం కబ్జాకు గురైందని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు కబ్జాకు గురైంది.. ఎవరూ పట్టించుకోలేదు.. సుమారు 300 గజాల స్థలం మాత్రమే ఉంది.. ఇప్పుడు అధికారులు రావడం విడ్డూరంగా ఉన్నదని స్థానికులు మండిపడుతున్నారు.
ఈ స్థలాన్ని అధికారులు కాపాడుతారో.? లేక ఆక్రమణదారులకు వదిలివేస్తారో..? అని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ స్పందించి.. ఇక్కడ చేపట్టిన ఆక్రమణలపై పూర్తిగా విచారణ చేపట్టాలని, అక్రమ కట్టడాలను తొలగించి, ఆ స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.