సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): నగర శివారుల్లో మూగ జీవాలకు రక్షణ కరువైంది. శివారులో ఉండే గొర్రె కాపర్లకు దొంగల భయం రోజురోజుకు పెరుగుతుంది. కోహెడ గ్రామ శివారులో సోమవారం తెల్లవారుజామున దొంగల బీభత్సం గొర్ల కాపరులలో మరింత భయాన్ని నింపింది. ఇల్లు వదిలి రాత్రి సమయంలో గొర్రెలు, మేకల మందల వద్ద కాపలా కాసే వారు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పశువుల దొంగలపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో దొంగల ముఠాలు చెలరేగిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల బయట రాచకొండ, సైబరాబాద్ కమిషనర్ల పరిధిలో ఈ దొంగతనాలు తరచుగా జరుగుతున్నాయి. కోహెడ వద్ద చోటుచేసుకున్న ఘటనలో బాధితుడైన గొర్రెల యజమాని కొడుకు వృత్తిరీత్యా కానిస్టేబుల్ అయినా దొంగలు ఏమాత్రం భయపడకుండా దాడి చేసి గొర్రెలను మేకలను ఎత్తుకెళ్లారు. చేవెళ్ల, పటాన్చెరు, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో గొర్రెలు మేకల మండల పై దొంగల ముఠాలు ఎప్పుడు కన్నేసి ఉంచుతాయంటూ చెబుతున్నారు.ఈ ముఠాలను పట్టుకోవాలని బాధితులు కోరుతున్నారు.
కోహెడలో చోటుచేసుకున్న ఘటన ను రాచకొండ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో ఆయా వాహనాల రూట్ లను గుర్తించేందుకు శివారులో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఈ ముఠాలు పూర్తి హిందీలో మాట్లాడడంతో హైదరాబాద్ ఓల్డ్ సిటీ చెందిన వాళ్లా.. లేక ఇతర రాష్ర్టాలకు చెందిన దొంగల అనే అంశాలపై పోలీసులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ర్టాల్లో ఇటీవల ఇలాంటి దొంగతనాలు జరిగాయా జరిగితే ఆయన దొంగతనాలు పాల్పడిన ముఠాలు ఎక్కడివి? అనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి ఓ ఆర్ ఆర్ ఎగ్జిట్ లు ఎంట్రీ పాయింట్ల వద్ద దొంగతనం జరిగిన సమయంలో ఆ రూట్లో వెళ్లిన బొలెరో వాహనాల వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.