సిటీబ్యూరో, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ) : మెరుపు వేగంతో విలువైన భూముల్లోకి చొరబడితే గానీ అధికారులు తేరుకునేలా లేరు. వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతుందనే విమర్శలతో హెచ్ఎండీఏ అధికారులు కదిలారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న భూములను జీఐఎస్ సర్వేతోపాటు, హద్దు రాళ్లు, ముళ్ల కంచెను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా మియాపూర్లోని సర్వే నం. 20, 28లో ఉండే భూముల చుట్టూ భారీ ముళ్ల కంచెను ఏర్పాటు చేయనున్నారు. మియాపూర్లో సర్వే నం.100,101 పరిధిలో 500 ఎకరాల పరిధిలో ఉన్న హెచ్ఎండీఏ భూములను ఆక్రమించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో భూములను పరిరక్షించడంలో హెచ్ఎండీఏ విఫలమైందనీ విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పటికీ పలు చోట్ల భూములు కబ్జాలకు గురవుతుండగా.. స్థానికుల ఫిర్యాదులతో ఆక్రమణలను నిలువరించేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మియాపూర్ సమీపంలో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూములకు ముళ్ల కంచెను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం దృష్టి సారించింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టగా.. వచ్చే రెండు నెలల వ్యవధిలో పనులు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.
హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న విలువైన భూములు, తాజా పరిస్థితిపై నివేదికలు రూపొందిస్తున్న అధికారులు తాజాగా భూముల స్థితిగతులను అంచనా వేసేందుకు జీఐఎస్ సర్వే నిర్వహించనున్నారు. దీని ద్వారా ఆయా భూములకు హద్దు రాళ్లను ఏర్పాటు చేయడంతోపాటు, దశల వారీగా కంచె నిర్మాణం చేపట్టనున్నారు.