Hyderabad | సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): శివారుల్లోనూ పబ్ కల్చర్ పెరుగుతున్నది. తమ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం వివిధ ప్రాంతాల నుంచి యువతులను పబ్‌లకు రప్పిస్తూ గబ్బు పనులతో యువకుల నుంచి అందినకాడికి కొన్ని పబ్‌ల నిర్వాహకులు దోచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు నగరంలోని ప్రధాన ప్రాంతాలకే పరిమితమైన ఈ కల్చర్ శివారులకు పాకడం ఆందోళన కలిగిస్తున్నది.
ఇటీవల చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలోని హార్ట్స్ పబ్‌పై ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. పోలీసులు వెళ్లే సరికి యువతులు అశ్లీల నృత్యాలు చేస్తూ, డీజేలతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న దృశ్యాలు కన్పించడంతో 16 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వ్యాపారాన్ని పెంచుకునేందుకు పబ్ నిర్వాహకుడు యువతులకు ఉచితంగా పబ్‌లోకి అనుమతిస్తున్నారని తేలింది.
బిల్లు పెంచేస్తారు..
పబ్‌కు వెళ్లే యువకులకు రూ.2వేలు ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నారు. ఒంటరిగా, స్నేహితులతో పబ్‌కు వెళ్లి యువకులు కేరింతలు కొడుతున్నారు. శివారులలో యువతులు ఎక్కువగా పబ్‌లకు వెళ్లరు. దీంతో ఓ పబ్ నిర్వాహకుడు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు నగరంలోని వివిధ పబ్‌లకు తరుచూ వెళ్లే యువతులను, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యువతులను తమ పబ్‌లోకి వచ్చేలా ఉచిత ఎంట్రీతో వెసులు బాటు కల్పిస్తున్నాడని పోలీసుల విచారణలో బయటపడింది.
అలా వెళ్లిన యువతులు పబ్‌లోకి వచ్చే ఇతర కస్టమర్లతో స్నేహంగా మెలుగుతూ యువకులకు దగ్గరవుతుంటారు. అలా పరిచయం చేసుకుంటూ యువకులతో మద్యం ఎక్కువగా తాగించడం, తమకు మ ద్యం తెప్పించుకోవడం చేస్తూ బిల్లును పెంచడమే ల క్ష్యంగా ఆ యువతుల వ్యవహారం ఉంటుందని పోలీసుల విచారణలో తేలింది. యువకులను బుట్టలో వేసి మద్యం తాగించడంతో పాటు ఖరీదైన మద్యం సేల్స్ ను పెంచేలా ఆ యువతులు స్కెచ్ వేస్తుంటారని ఆరోపణలున్నాయి.
ఎక్కువ గిరాకీ చేసే యువకులతో అక్కడుండే యువతులు కొందరు నృత్యాలు చేస్తుండగా.. మరికొందరు మరో అడుగు ముందుకేసి అశ్లీల నృత్యా లు సైతం చేస్తుంటారని పోలీసులు పేర్కొంటున్నారు. చైతన్యపురిలో పట్టుబడ్డ హార్ట్స్ పబ్ నిర్వాహకుడికి బంజారాహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లోనూ పబ్‌లతో సంబంధాలున్నట్లు విచారణలో తేలింది. ఇలా అక్కడి కల్చర్‌ను శివారుల్లో కూడా నిర్వహించి లాభాలు గడించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పరోక్షంగా వ్యభిచారం ప్రోత్సహించినట్లే..!
పబ్ నిర్వాహకులు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి వేసిన ఈ ప్లాన్లు పరోక్షంగా వ్యభిచారాన్ని కూడా ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని పోలీసులు భావిస్తున్నారు. మద్యం మత్తులో అశ్లీల ప్రదర్శనలు చేస్తూ బయటకు వెళ్లిన తరువాత వాళ్లు కలుసుకునే అవకాశాలు కూడా లేకపోలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వీళ్ల వ్యవహారం శాంతి భద్రతలకు కూడా విఘాతం కల్గించే అవకాశాలున్నాయి.
యువతుల కోసం యువకులు గొడవలు పడటం, రోడ్లపై అశ్లీలంగా వ్యవహరించడం కూడా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యాపారం కోసం ని బంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చైతన్యపురిలో వెలుగుచూసిన ఈ ఘటనతో అప్రమత్తమైన రాచకొండ పోలీసులు కమిషనరేట్ పరిధిలో ఉన్న సుమారు 10 పబ్లతోపాటు బార్లపై మరింత నిఘాను మరింత పెంచారు.
మాముళ్లు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిలింగ్
ఈ వ్యవహారంపై పబ్ నిర్వాహకుడు మరోలా స్పందిస్తున్నాడు. పబ్‌కు వచ్చే యువతులకు తమకు ఎలాంటి సంబంధంలేదని, తనను కొందరు రాజకీయ నాయకులు, యువ సేనాలు, సంఘాలు, కొందరు రిపోర్టర్లమంటూ వచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు. వారు చేసిన బ్లాక్‌మెయిలింగ్‌కు తలొగ్గకపోవడంతోనే తమపై పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆరోపించాడు. గురువారం సోషల్‌మీడియాలో పబ్ యజమాని అంటూ ఒక వాయిస్ మెసేజ్‌ను పోస్టు చేశారు.
అది వైరల్ అయ్యింది. కొం దరు తమకు నెలవారీగా మాముళ్లు ఇవ్వాలని, తాము లోకల్ వాళ్లమని డబ్బు ఇవ్వాలని, మరికొందరు రాజకీయ నాయకుల పేర్లు చెబుతూ తమను బ్లాక్మెయిల్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించాడు. ప్రభుత్వానికి తాము సంవత్సరానికి ఫీజు చెల్లిస్తున్నామన్నారు. బ్లాక్‌మెయిలింగ్‌లకు తలొగ్గకపోవడంతోనే తమపై పోలీసులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ వాయిస్‌లో పేర్కొనడం గమనార్హం.