సిటీబ్యూరో, జూన్ 1(నమస్తే తెలంగాణ) : దేశంలోనే రెండో అతిపెద్ద నైట్ సఫారీ పార్క్ ప్రతిపాదనలు అటకెక్కాయి. విదేశీ తరహాలో నిశాచర వన్య మృగాలతో పర్యాటక ప్రాంతాన్నీ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తీర్చిదిద్ది కార్యరూపంలోకి తీసుకొచ్చినా… కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది.
నగరంలోని అవుటర్ రింగు రోడ్డుకు సమీపంలో ఉన్న కొత్వాల్‌గూడ ఎకో పార్కు వద్ద, హిమయత్ సాగర్ సమీపంలో ఈ ప్రాజెక్టును చేపట్టగా… హెచ్ఎండీఏ డిజైన్లు సిద్ధం చేసింది. దాదాపు 85 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టగా… అందుకు నిధులు, నిర్వహణ వ్యయం, ప్రాజెక్టు వివరాలతో సమగ్రమైన నివేదిక కూడా సిద్ధం చేసింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ఈ ప్రాజెక్టు కనుమరుగైపోయింది.
సింగపూర్ నైట్ సఫారీ తరహాలో నగరంలో అరుదైన వన్య మృగాలతో నైట్ సఫారీ ఏకో పార్క్ నిర్మించేలా హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించిన వివరాలతో సాధ్య అసాధ్యాలను వివరిస్తూ నివేదిక రూపొందించారు. దీంతో నగరం దేశంలోనే రెండో నైట్ సఫారీ కలిగిన ప్రాంతంగా మార్చేలా సిద్ధం చేసిన ప్రణాళికలన్నీ కూడా అటకెక్కాయి. ప్రస్తుతం సాధారణ జంతు ప్రదర్శనశాలల కంటే ఎంతో వైవిధ్యంగా, అరుదైన జంతుజాలం నివసించేందుకు అనువుగా నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ ఇవేవీ పట్టనట్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ ప్రతిపాదనలు పక్కన పెట్టినట్లు తెలిసింది. అప్పటికే సిద్ధం చేసిన సమగ్ర నివేదికలను కాలరాస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు హైదరాబాద్ పర్యాటక రంగానికి ఇబ్బందిగా మారుతున్నాయి.
నైట్ సఫారీ పార్కుల నిర్వహణలో సింగపూర్ ముందంజలో ఉంది. 1994లోనే నైట్ సఫారీ పార్కులను ఏర్పాటు చేసింది. 2500కుపైగా జంతువులు, 130 జాతులతో 86 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టారు. అదే తరహాలో గండిపేట మండలం పరిధిలోని కొత్వాల్‌గూడ ఎకో పార్క్‌లోనే నైట్ సఫారీ ఏర్పాటు చేసేందుకు అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సూచనలతో అధికారులు సింగపూర్ సంస్థలను ఆశ్రయించారు. వారి సాయంతో ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ఆ పనులను పక్కన పెట్టి, ఎప్పుడో మొదలైన కొత్వాల్‌గూడ ఎకో పార్క్‌ను కూడా పూర్తి చేయకుండా జాప్యం చేస్తున్నది. దీంతో నగరానికి అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రం దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం పెండింగ్‌లో ఉన్న పనులనైనా పూర్తి చేయాలని హెచ్ఎండీఏను ఆదేశించడంలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తుండటంతో ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు రూపం లేకుండా పోతున్నాయి.