Jalamandali | సిటీబ్యూరో: మురుగు నీటి నిర్వహణ సాఫీగా సాగేందుకు 90 రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి వెల్లడించారు. సీవరేజీ ఓవర్ ఫ్లో సిటీ-హైదరాబాద్ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి 70 రోజులు పూర్తయిందని, 100 లొకేషన్లలో 11.8 కిలోమీటర్ల మేర కొత్తగా సీవరేజీ పైపులైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. 90 రోజుల వ్యవధిలో 3600 కిలోమీటర్ల సీవరేజీ పైపులైన్, మూడు లక్షల మ్యాన్‌హోళ్లలో డీ సిల్టింగ్ చేయడంతో పాటు సీవరేజీపై రోజూ వచ్చే ఫిర్యాదులను 30 శాతం తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎండీ వివరించారు.
ఇప్పటి వరకు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని 50 శాతం చేరుకున్నట్లు పేర్కొన్నారు. బుధవారం నాటికి 12673 ప్రాంతాల్లో 1602 కిలోమీటర్ల మేర సీవరేజీ పైపులైన్, 1.22 లక్షల మ్యాన్‌హోళ్లలో పూడికతీత పనులు చేపట్టినట్లు అశోక్‌రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో బుధవారం ఆయన సమావేశమై వివరాలు వెల్లడించారు.
ఈ 90 రోజుల స్పెషల్ డ్రైవ్‌లో జలమండలికి రోజువారీగా వచ్చే ఫిర్యాదుల్ని పరిషరించడంతో పాటు.. ఒకో టీమ్ 100 నుంచి 200 మీటర్ల మేర పైపులైన్, 20 నుంచి 25 మ్యాన్ హోళ్లను శుభ్రం చేస్తున్నట్లు ఎండీ పేరొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అదనంగా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఎండీ తెలిపారు. మురుగు నీటి నిర్వహణలో రోజూవారీగా ఉపయోగించే 220 ఎయిర్ టెక్ మిషన్లు, 146 సిల్ట్ తరలింపు వాహనాలు, సీవరేజీ సిబ్బందినే ఇందులోనూ వాడుకునేలా కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. ఇది సత్ఫలితాన్నిస్తే భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
స్పెషల్ డ్రైవ్ పనులను రోజూవారీగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక డాష్ బోర్డ్ ఏర్పాటు చేశామని ఎండీ చెప్పారు. సీవరేజీ ఓవర్ ఫ్లో, కలుషిత నీరు, రోడ్లపై సిల్ట్ తదితర వాటిపై ఎంసీసీకి వచ్చే ఫిర్యాదులను ఆయా క్యాన్ నంబర్లను జీపీఎస్ ఆధారంగా గూగుల్ మ్యాప్‌లో నమోదు చేస్తున్నామన్నారు. ఈ నమోదు ఒకో ప్రాంతంలో ఎన్ని సార్లు ఫిర్యాదులు అందినవి, ఎన్నిసార్లు పరిషరించిన వివరాలను ఆ మ్యాప్ లో ఒక బబుల్ (బుడగ) లా కనిపించేలాగా ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదుల సంఖ్యను బట్టి.. ఆ బబుల్ పరిమాణం మారుతుందని చెప్పారు. ఈ ఏర్పాటు వల్ల సమస్య తీవ్రతను బట్టి అధికారులు దానిని పరిషరించే వీలుందన్నారు.