PTP | సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : ఆస్తిపన్ను సమస్యల పరిష్కారానికి ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి 29 వరకు ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ప్రజలకు ఆస్తిపన్ను సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పీటీపీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఆస్తిపన్ను సమస్యలు, పున ః సమీక్ష అభ్యర్థనలు, ఆస్తిపన్ను అంచనాల్లో సవరణలు, బిల్ కలెక్టర్లు, ఆర్టీజీఎస్ చెల్లింపులు, ఆన్లైన్ బకాయిలు సరిచేయడం, కోర్టు కేసుల పరిష్కారం, ఐజీఆర్ఎస్ సమస్యలు, స్వీయ మదింపు సంబంధిత విషయాలు, ఇతర పన్ను సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం ఈ నెల 22, మార్చి 1, 8, 15, 22,29 తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆస్తిపన్నుకు సంబంధించిన ఏవైనా సమస్యలున్న వారు తమ సంబంధిత జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఆయా తేదీలలో నిర్వహించే ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ కార్యక్రమంలో సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.