Property Tax | సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లలో గత ఏడాది గణంకాలను అధిగమించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1917 కోట్లు వసూలు కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.2038.42 కోట్లు వసూలైందని కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే మొదటి సారి 14 లక్షల మందికి పైగా పన్ను చెల్లించడం ద్వారా అద్భుతమైన వసూళ్లను సాధించిందన్నారు.
గత నెల 7వ తేదీన బకాయిదారులకు వన్ టైం సెటిల్మెంట్ స్కీంను ప్రభుత్వం అవకాశం కల్పించగా.. ఓటీఎస్ రూపంలో దాదాపు రూ.470 కోట్ల వచ్చినట్లు అధికారులు తెలిపారు. అదనపు కమిషనర్ అనురాగ్ జయంత్, చీఫ్ వ్యాల్యుయేషన్ అధికారి (సీవీఓ) కులకర్ణి ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పన్ను బకాయిల వసూళ్లు సమిష్టి కృషితో సులభతరమైందని చెప్పారు.
బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ల సహకారం, డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర పన్నుల విభాగం, ఐటీ, ఆర్థిక విభాగాలు కీలకమైన పాత్ర పోషించాయని కమిషనర్ పేర్కొన్నారు. కాగా 30 సర్కిళ్లకు గానూ అత్యధికంగా శేరిలింగంపల్లిలో రూ.288.14కోట్లు, జూబ్లీహిల్స్ సర్కిల్లో రూ.190 కోట్లు, ఖైరతాబాద్‌లో రూ.173.65కోట్లు , అత్యల్పంగా ఫలక్‌నుమా సర్కిల్లో రూ.12.51కోట్లు వసూలైంది.