సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లలో లక్ష్యాన్ని అధిగమించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు రూ.2012.36 కోట్ల ఆదాయం వచ్చినట్లు కమిషనర్ ఇలంబర్తి ప్రకటనలో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే మొదటి సారి 14 లక్షల మందికి పైగా పన్నులు చెల్లించడం ద్వారా ఆదాయం రూ.2వేల కోట్లు దాటిందని తెలిపారు.
కాగా గత నెల 7వ తేదీన బకాయిదారులకు వన్ టైం సెటిల్మెంట్ స్కీంను ప్రభుత్వం అవకాశం కల్పించగా.. ఓటీఎస్ రూపంలో రూ.465 కోట్ల వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా చివరి ఒక్కరోజే రూ.115 కోట్ల పన్ను వసూలైందని అధికారులు చెప్పారు. అదనపు కమిషనర్ అనురాగ్ జయంత్, చీఫ్ వ్యాల్యుయేషన్ అధికారి (సీవీఓ) కులకర్ణి, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లను కమిషనర్ అభినందించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1917 కోట్ల మేర ఆస్తిపన్ను వసూలైంది. అర్థరాత్రి 11 గంటల వరకు చెల్లింపులకు సమయం ఉందని, మంగళవారం ఆస్తిపన్ను వసూళ్ల లెక్కను సమగ్రంగా వివరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.