బొల్లారం,అక్టోబర్ 13: జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు చేపట్టనున్న ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణాన్ని ప్రభుత్వం 200 ఫీట్ల నుంచి 100 ఫీట్లకు తగ్గించి బాధితులకు భూమికి బదులుగా భూమిని కేటాయించా లని రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ అసోసి యేన్(జేఎసీ) అధ్యక్షుడు తేలుకుంట సతీశ్ గుప్తా డిమాండ్ చేశారు. సోమవారం లోతు కుంట నుంచి అల్వాల్ తెలంగాణ తల్లి విగ్రహం వరకు రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు వెడల్పు తగ్గించి మా జీవితాలను కాపాడాలని డిమాండ్ చేశారు. అనంతరం తేలుకుంట సతీశ్గుప్తా మాట్లాడుతూ.. గత ఏడాది నుండి హైకోర్టులో స్టే ఉన్నా ప్రభుత్వం ఓ పత్రికలో రోడ్డు విస్తరణకు అంతా సిద్ధం అనే ప్రకటన ఇవ్వడంతో బాధితులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు.
గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉప్పల్‌లో బాధితుల కోరిక మేరకు 200 ఫీట్ల నుంచి 150 ఫీట్లకు తగ్గించారని, భూమికి బదులు భూమి ఇచ్చారని గుర్తు చేశారు. ఇక్కడ కూడా ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణాన్ని 200 ఫీట్ల నుంచి 100 ఫీట్లకు తగ్గించాలన్నారు. ఆస్తులు కోల్పోతున్న బాధితులకు నగరం నడిబొడ్డున కమర్షియల్ భూమి ఇచ్చి ప్రస్తుత వ్యాపార సముదాయంలో పనిచేస్తున్న వారికి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ సీ-బ్లాక్ ఇన్చార్జి డాక్టర్ సుధాకర్, రాఘవేంద్రరావు, నవీన్‌రెడ్డి, సీపీ నారాయణ, ధనలక్ష్మి, అనూరాధ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.