సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ సిబ్బందితో వెను వెంటనే సమస్యలకు పరిష్కారం చూపుతున్నది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురవగా, జీహెచ్ఎంసీ గ్రీవెన్స్‌సెల్‌కు, జీహెచ్ఎంసీ టోల్‌ఫ్రీ నంబరుకు ప్రజలు ఫిర్యాదులు చేశారు. రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు…25 ప్రాంతాల్లోని ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించారు. 18 చోట్ల విరిగిపడిన చెట్లకొమ్మలను తొలగించారు. ఒక చోట అగ్ని ప్రమాదం జరగగా.. సహాయక చర్యలు, ఆరు చోట్ల వరద నీరు నిలవగా నీటిని క్లియర్ చేశారు. పౌరులు అందించే ఫిర్యాదుల పరిష్కారంలో డీఆర్ఎఫ్ అప్రమత్తంగా ఉండి చర్యలు చేపడుతున్నదని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు.