Gurukula Schools | చిక్కడపల్లి, ఆగస్టు 30: గురుకుల విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘గురుకులాలా.. మృత్యు వలయాల’.. అనే పేరుతో గురుకులాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో ధర్నా నిర్వహించారు.
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు భువనగిరి మధు అధ్యక్షత వహించిన ఈ ధర్నాలో ముఖ్య అతిథిగా సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి పోడపంగి నాగరాజు, నాయకులు మైస శ్రీనివాస్, టీపీటీఎస్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్, పీడీఎస్యూ మాజీ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యను ప్రధాన అంశంగా తీసుకుని పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారని తెలిపారు.
కానీ, ఈ ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కూడా కల్పించకుండా కాలయాపన చేస్తున్నదని, దీంతో విద్యార్థులు ఫుడ్ పాయిజన్, విషజ్వరాల బారిన పడి మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం మరణాలపై విచారణ జరిపించకుండా, సమీక్షించుకోకుండా.. వసతులు కల్పించకుండా పాలన కొనసాగిస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పిందని, అధికారంలోకి రాగానే విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ధ్వజమెత్తారు. గురుకుల పాఠశాలల్లో కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
జ్వరాల బారిన పడ్డ విద్యార్థులకు వైద్య సేవలందించేందుకు కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదని వివరించారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు డి.ప్రణయ్, మంద నీవన్, నరసింహారెడ్డి, మామిడాల మహేశ్, తీగల శ్యామ్, మాదారపు నాగరాజు, మామిడాల ప్రవీణ్, సందీప్, యశ్వంత్ మహేశ్ రాజు తదితరులు పాల్గొన్నారు.