Property Tax | సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : ఆస్తి పన్ను కట్టని వారిని జీహెచ్ఎంసీ లక్ష్యంగా చేసుకున్నది. పన్ను కట్టని వారి ఆస్తులను సీజ్ చేస్తామంటూ బెదిరిస్తున్నది. ఇందులో భాగంగానే ప్రతిరోజూ ఒక్కో సర్కిల్లో ఐదేసి చొప్పున ఆస్తులను సీజ్ చేస్తున్నది. వచ్చే నెలాఖరులో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దరిమిలా జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లపై దూకుడు పెంచింది. చిన్నా, చితకా బకాయిదారుల నుంచి బడా వ్యక్తుల వరకు బకాయిదారుల చిట్టాను రూపొందించింది. సంస్థ ఖజానాను నింపుకోవడమే ఏకైక ఎజెండాగా కార్యాచరణను ప్రకటించింది.
గత మూడు సంవత్సరాల పైబడి బకాయిలు పెండింగ్‌లో ఉండి పన్ను చెల్లించని వాళ్లకి వారెంట్స్ ఇష్యూ చేస్తున్నారు. ఇందులో భాగంగానే 6 లక్షల మంది బకాయిదారులకి రెడ్ నోటీసులు జారీ చేశారు. వీరి నుంచి రూ.400కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించాలని వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసులకు స్పందించిన వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ 269(2) కింద ఆస్తులను సీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటి వరకు 80 ఆస్తులను సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం బంజారాహిల్స్‌లోని తాజ్ బంజారా భవనాన్ని సీజ్ చేయగా.. సదరు యాజమాని స్పందించి శుక్రవారం ఆర్టీజీఎస్ ద్వారా జీహెచ్ఎంసీకి రూ. 51 లక్షల 50వేలను చెల్లించారు.
ఆస్తిపన్ను బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 30 సర్కిళ్లలో బకాయిదారులను చిట్టాను సిద్దం చేసి వారికి రెడ్ నోటీసులు జారీ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. రోజురోజుకు సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుండడం, ఈ ఆర్థిక సంవత్సరం రూ.2000కోట్ల నిర్దేశిత లక్ష్యంలో ఇప్పటి వరకు కేవలం రూ.1480కోట్ల మేర పన్నులు రావడంతో బకాయిదారులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. 19.25 లక్షల మందిలో 12 లక్షల మంది మాత్రమే ఆస్తిపన్ను చెల్లించారని, దాదాపు 6.75 లక్షల మందిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి రూ.520 కోట్లు రాబట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సూపర్వైజరీ ఆఫీసర్లు రోజూ వారీగా వసూలైన ఓటీఎస్ కలెక్షన్లను పీటీఐఎన్ నంబరు, వచ్చిన కలెక్షన్ల వివరాలను ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోనున్నారు. ఆస్తిపన్ను చెల్లించాలని బకాయిదారులకు ఎస్ఎంఎస్లు పంపించనున్నారు.
జీహెచ్ఎంసీకి ఆస్తిపన్ను రూపంలో మొండి బకాయిలు మొత్తం దాదాపుగా రూ. 9800 కోట్ల మేర రావాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలదే కీలకం. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన 600 ఆస్తుల నుంచి రూ. 500 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు 4వేల ప్రాపర్టీల నుంచి రూ. 5000కోట్ల బకాయిలు జీహెచ్ఎంసీ ఖజానాను చేరాల్సి ఉంది. అయితే సాధారణ నగరవాసుల విషయంలో ప్రాపర్టీల సీజ్ వరకు వెళుతున్న అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బకాయిల రాబడిలో మాత్రం తూతూ మంత్రంగా నోటీసులతో సరిపెడుతున్నారన్న విమర్శలు లేకపోలేదు.