సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ‘ఆమె’ చెప్పిందే వేదం….ఆమె చెసిందే శాసనం. ఎవరైనా ఆమె మాట వినాల్సిందే. ఆమెకు ఎవ రూ ఎదురు చెప్పలేరు. అంతటి విశిష్టి అధికారం చెలాయిస్తున్న ఆమె ఐఏఎస్ కాదు.. గ్రూప్-1 అధికారి కాదు.. కనీసం కుటుం బ సంక్షేమ శాఖకు చెందిన అధికారి కూడా కాదు.. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారి అంతకన్నా కాదు..ఆమె ఎన్హెచ్ఎం విభాగంలో పనిచేసే ఓ ప్రైవేటు కన్సల్టెంట్. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌కు షాడో పీడీ.
ఆమెకు సంబంధిత శాఖాధిపతి విశిష్ట అధికారులు కట్టబెట్టినట్లు టీజీ సాక్స్ కోడై కూస్తోంది. ప్రభుత్వ అధికారులపైన ఒక ప్రైవేటు ఎన్జీవో నుంచి వచ్చిన వ్యక్తి అధికారం చెలాయించడమేంటని సాక్స్ ఉద్యోగులు, అధికారులు మండిపడుతున్నారు. కొంత కాలంగా టీజీ-సాక్స్‌కు పూర్తిస్థాయి ప్రాజెక్ట్ డైరెక్టర్ లేకపోవడంతో ఆ శాఖ పూర్తిగా గాడితప్పిన విషయం తెలిసిందే. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో రోజురోజుకు రాష్ట్రంలో హెచ్ఐవీ కేసులు పెరిగిపోవడంతో పాటు ఆ వ్యాధిగ్రస్తులు మరణాల రేటు కూడా పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా రోగులకు జరపాల్సిన ఐసీటీసీ పరీక్షలు, అందాల్సిన వైద్య సేవలు వంటివి సరిగ్గా అందడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
హెచ్ఐవీ రోగులకు చికిత్స, కౌన్సిలింగ్, వైద్య పరీక్షలు జరిపే ఏఆర్టీ సెంటర్ల నిర్వహణ కూడా పూర్తిగా గాడి తప్పడంతో కళ్లు తెరిచిన ప్రభుత్వం ఆఘమేఘాల మీద ప్రస్తుత హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి టీజీ-సాక్స్‌కు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఇన్చార్జి పీడీగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్హెచ్ఎం విభాగంలో ప్రైవేటు కన్సల్టెంట్‌గా పనిచేసే ఓ మహిళ కమిషనర్ సూచన మేరకు టిజీ-సాక్స్‌పై అధికారం చెలాయిస్తున్నారని సాక్స్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. సదరు మహిళ అధికారిక కార్యకలాపాలలో పరిధిలు దాటి జోక్యం చేసుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులకు ఆదేశాలు ఇవ్వడం, తన ఆదేశాలనే కమిషనర్ ఆదేశాలుగా జారీచేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు సాక్స్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఇన్చార్జి పీడీ నిర్లక్ష్యం, షాడో పీడీ అసమర్థత, అత్యుత్సాహంతోనే టీజీ సాక్స్‌కు న్యాకో విడుదల చేసిన రూ.7.56 కోట్లు వెనక్కి వెళ్లిపోయినట్లు సాక్స్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హెచ్ఐవీ రోగుల చికిత్స, వైద్యపరీక్షలు, మందుల కొనుగోలు, కౌన్సిలర్లకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు వంటి టీజీ సాక్స్ నిర్వహణ కోసం నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(న్యాకో) సుమారు రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేసింది. అయితే హెచ్ఐవీ రోగులకు సంబంధించిన చికిత్సపై పూర్తిగా నిర్లక్ష్యం వహించి, సాక్స్ అవసరాలను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆ నిధులు అలాగే మిగిలిపోయాయి.
ఇది గమనించిన న్యాకో టీజీ-సాక్స్‌కు విడుదల చేసిన రూ.7.56కోట్ల నిధులను మార్చి 31న వెనక్కి తీసుకుంది. అంతేకాకుండా హెచ్ఐవీ రోగులకు వినియోగించాల్సిన ఈ నిధుల్లో నుంచి సుమారు కోటి రూపాయలను నిబంధనలకు విరుద్ధంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు మళ్లించినట్లు విశ్వసనీయ సమాచారం. సాక్స్ నిధులు వెనక్కి పోవడానికి ప్రధాన కారణం షాడో పీడీగా వ్యవహరిస్తున్న ప్రైవేటు కన్సల్టెంటే అని, సాక్స్‌కు సంబంధించిన బిల్లులను పెండింగ్‌లో పెట్టడం, మందులు, టెస్టింగ్ కిట్స్ వంటిని కొనుగోలు చేయకుండా సంబంధిత అధికారులు పంపిన నోట్ ఫైల్స్‌ను ఇన్చార్జి పీడీకి పంపకపోవడంతో పాటు సదరు కన్సల్టెంట్‌ను గుడ్డిగా నమ్మి, సాక్స్ నిర్వహణపై పూర్తి నిర్లక్ష్యం వహించడం వల్లే కోట్ల రూపాయల నిధులు వెనక్కి పోయినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.