సికింద్రాబాద్, నవంబర్ 26: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నియోజకవర్గాల అభివృద్ధికి ఇచ్చే నిధులు పెంచటంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ కోటా మొత్తంలో సింహభాగం సర్కారు బడుల అభివృద్ధికి వినియోగించాలనే నిబంధన తీసుకురావడం.. శుభ పరిణామం. విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కల్పించాల్సిన సదుపాయాలకు ప్రతిపాదనలు రూపొందించే దిశగా అడుగులు పడుతున్నాయి. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పాఠశాల భవనాలు, సౌకర్యాల పరిస్థితులను ఇప్పటికే అధికారులతో కలిసి పర్యవేక్షించిన ఎమ్మెల్యే సాయన్న ఆయా పాఠశాలల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పూర్తి చేసే బృహత్తర కార్యక్రమానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, మేజర్ మరమ్మతు పనులను ముందుగా పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలో ఉన్న 26 పాఠశాలలకు రూ.2కోట్ల మేర నిధులను కేటాయించడం జరిగింది. వీటిని అత్యవసర పనులతో పాటు కనీస మౌలిక సదుపాయాలకు మోక్షం లభించనుంది.
అవసరమైన చోట మరుగుదొడ్లు.. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 26 స్కూళ్లకు సుమారు రూ.2 కోట్లు నిధులు కేటాయించింది. వీటిలో 8 స్కూళ్లకు రూ.34 లక్షలతో మరుగుదొడ్లు నిర్మించనున్నారు. అదే విధంగా మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, మహేంద్రాహిల్స్‌లోని ప్రభుత్వ బీసీ బాలుర సంక్షేమ హాస్టల్ల్లో పవర్ బోర్‌వెల్స్‌కు నిధులు మంజూరు చేయగా, బోయిన్‌పల్లిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సైతం పవర్ బోర్వెర్కు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో పాటు మూడు పాఠశాలల్లో రక్షిత మంచినీటి ప్లాంట్ల నిర్మాణానికి సుమారు రూ. 10 లక్షలు మంజూరు చేయగా, మరో మూడు పాఠశాలలో రక్షిత మంచినీటి ప్లాంట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు తీసుకొన్నారు. ఈ క్రమంలో మేజర్ పాఠశాలలో సీసీ ఫ్లోరింగ్, కంపౌండ్ వాల్, గేట్లు, తరగతి గదుల నిర్మాణాలు, పాఠశాలల పైకప్పుల మరమ్మతులు, డోర్స్, ఎలక్ట్రికల్ వైరింగ్, లైట్స్, ఫ్యాన్లు, డ్రైనేజీ మరమ్మతులు, గ్రిల్స్ ఏర్పాటు, బెంచీలు, కుర్చీలు, కిటికీలు, ఆయా పాఠశాలలకు రంగులు వేయడం వంటి వాటికి సుమారు రూ. 1.కోటి 26లక్షల నిధులను కేటాయించారు. బొల్లారంలోని ప్రభుత్వ బాలు ర ఉన్నత పాఠశాలలో నూతనంగా రూ.3లక్షల తో మరుగుదొడ్లను నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు.
మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం
కంటోన్మెంట్ వ్యాప్తంగా గతంలో పెండింగ్‌లో ఉన్న పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. సర్కార్ బడులు స్వరూపాన్ని మార్చడమే కాకుండా, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాం. కంటోన్మెంట్‌లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీడీపీ నిధుల నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. సుమారు రూ.2కోట్ల వ్యయంతో నియోజకవర్గంలోని ప్రభుత్వ బడులను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం.