కవాడిగూడ, ఆగస్టు 20: మల్టీజోన్ స్థాయి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఇందిరాపార్క వద్ద గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సంఘం ప్రతినిధులు దామోదర్‌రెడ్డి, అచ్యుతరెడ్డి, కృష్ణాచారి, విష్ణువర్ధన్‌రెడ్డి, పీవీఎల్ఎన్ మూర్తి, రత్నాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. పలు కారణాలతో ఆగిపోయిన పదోన్నతులను సుదీర్ఘ విరామం తర్వాత సెప్టెంబర్ 23లో షెడ్యూల్డ్ ప్రకటించి 2వేల మంది ఉపాధ్యాయులకు మల్టీ జోన్ 1, 2లలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పోస్టింగ్ కల్పించారన్నారు. నూతన మల్టీజోన్ వ్యవస్థ రావడంతో సీనియారిటీ వ్యత్యాసంతో ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులు వారు పనిచేస్తున్న జిల్లాలు కాకుండా బదిలీ తర్వాత మారుమూల ప్రాంతాల జిల్లాలకు కేటాయించబడినట్లు తెలిపారు.
ప్రతి జిల్లాల్లో పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీలు ఉన్నందున వాటి భర్తీ కోసం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేపడితే మల్టీజోన్ వ్యవస్థతో సుదూర ప్రాంతాలకు వెళ్లి పనిచేస్తూ ఇబ్బందులకు గురవుతున్న ప్రధానోపాధ్యాయులకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 902 ప్రధానోపాధ్యాయ పోస్టులను బదిలీలతో భర్తీ చేసిన తర్వాతే మిగతా వారికి ప్రమోషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. 317 జీవో కంటే తీవ్రమైనదిగా గెజిటెడ్ ప్రదానోపాధ్యాయుల సమస్యను పరిగణించి సీఎం రేవంత్‌రెడ్డి సమస్య పరిష్కారానికి చొరవచూపాలన్నారు. టీఎస్‌యుటీఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంకట్, టీజీహెచ్యంఎ రాష్ట్ర కార్యదర్శి హేమచంద్రుడు, వేణుగోపాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.