సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో పలువురు జోనల్ కమిషనర్లకు స్థానచలనం కల్పిస్తూ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి అభిలాష అభినవ్, శేరిలింగంపల్లి కొత్త జోనల్ కమిషనర్‌గా మరో ఐఏఎస్ స్నేహ శబరీష్‌ను నియమించారు.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు, జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి డిప్యూటేషన్ రద్దు చేసి మాతృ సంస్థ చేనేత, జౌళిశాఖ అదనపు డైరెక్టర్‌గా బదిలీ చేశారు. జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీపీ ఎస్ఈ వెంకటరమణను మూసీ నది అభివృద్ధి సంస్థ ఎస్ఈగా బదిలీ చేశారు. ప్రస్తుతం మూసీ అభివృద్ధి సంస్థ ఎస్ఈ మల్లికార్జునుడును ఈఎన్సీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
జీహెచ్ఎంసీలో పలువురు డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వై. శ్రీనివాస్ రెడ్డిని సర్కిల్-10కు, ఏఎంసీ డి. లావణ్యను ప్రధాన కార్యాలయానికి, సర్కిల్ 25కు వి. నర్సింహ, సర్కిల్-7కు ఏ.నాగమణి, సర్కిల్ 9కు ఎల్. సరిత, డాకు నాయక్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.