అబిడ్స్, ఆగస్టు 20: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీఆర్‌జీటీఏ, టీఆర్టీయూ టీఎస్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయ ఎంఎల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్‌జీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్‌కుమార్ రెడ్డి, టీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి కలిసి చీఫ్ సెక్రటరీ శాంతికుమారికి వినతి పత్రం అందజేసి, సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గురుకులాలలో మార్చిన ప్రస్తుత టైమ్ టేబుల్‌ను మార్చాలని, టైమ్ టేబుల్ మార్చడంతో ఇబ్బందులు ఏర్పడి పిల్లల అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. అన్ని రెసిడెన్షియల్ సంస్థల్లో స్థానభ్రంశం చెందిన 317 మంది ఉద్యోగుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, వారికి ప్రాధాన్య జోన్లకు తిరిగి కేటాయించాలని కోరారు. అన్ని గురుకుల ఉద్యోగుల జీతాలు 010 ఖాతా ద్వారా మాత్రమే పంపిణీ చేయాలని, పబ్లిక్, జనరల్ సెలవు దినాలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సీసీఎల్ క్లెయిమ్ చేయడానికి అవకాశం కల్పించాలన్నారు.
అన్ని గురుకుల పాఠశాలలు, కళాశాలలకు రెండో శనివారం సెలవుగా ప్రకటించాలని, మరిన్ని డిమాండ్లను తమ వినతిపత్రంలో పెట్టగా.. అందుకు చీఫ్ సెక్రటరీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అంతకు ముందు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి కూడా వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. వినతిపత్రం సమర్పించిన వారిలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర బాధ్యులు శ్రీనివాస్ రెడ్డి, పీఆర్‌జీటీఏ సెక్రటరీ వేముల స్వప్న, టీఆర్జీటీఏ టెమ్రీస్ అధ్యక్షుడు పానుగంటి విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.