యాచారం, మే 22: జనాభా లెక్కల కోసం వచ్చానని మాయ మాటలు చెప్పిన ఓ దుండగుడు వృద్ధురాలి మెడలో నుంచి నాలుగు తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయాడు. ఈ ఘటన యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకున్నది. సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం..మండల కేంద్రంలోని యాచారం పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న గాండ్లగూడ గ్రామానికి చెందిన దేవరకొండ పోచమ్మ ఉదయం తన ఇంటి ముందు ఆరు బయట కూర్చొని ఉంది.
బైకుపై హెల్మెట్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి నేరుగా పోచమ్మ ఇంటికి వచ్చాడు. తాను జనాభా లెక్కల కోసం వచ్చానని.. వివరాలు చెప్పాలని మాటలు కలిపాడు. మాయ మాటలు చెప్పిన ఆ దుండగుడు.. ఆమె మెడలో ఉన్న మూడు తులాల పుస్తెలతాడుతో పాటు చెవి కమ్మలను బలంగా లాగాడు. పోచమ్మ చెవి కమ్మలను దుండగుడు బలంగా లాగడంతో ఆమె చెవులకు గాయాలయ్యాయి. చోరీకి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.