ఖైరతాబాద్, జూన్ 14: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సర్పంచ్ల బకాయిలు తీర్చేస్తామని.. లేని పక్షంలో గల్లాపట్టి అడగాలంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని బుట్టదాఖలు చేశారని తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు పృథ్విరాజ్ మండిపడ్డారు. తెలంగాణ సర్పంచ్ల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్‌లు గ్రామాభివృద్ధి కోసం అప్పులు చేసి మరీ అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. అయితే ప్రభుత్వం చేసిన పనులకు డబ్బులు ఇవ్వకపోవడంతో అనేకమంది సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని.. మరికొందరు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్నత చదువులు చదివినా తాము పుట్టి పెరిగిన గ్రామంపై ఉన్న మమకారంతో చాలామంది యువత సర్పంచ్‌లుగా పోటీచేశారని, వారి ఆశలను ప్రభుత్వం అడియాశలు చేసిందన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారని.. స్వరాష్ట్రంలో గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచ్‌లకు మాత్రం బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన పనులకు డబ్బులు వస్తాయని, అప్పులు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసిన సర్పంచ్‌లకు మాత్రం మొండిచేయి చూపుతున్నారన్నారు.
తెలంగాణ సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. గడిచిన 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్పంచ్‌లను మభ్యపెడుతూ వస్తున్నారని, ఆయన జాగలమ్మి తమ డబ్బులు ఇవ్వమనడం లేదని, తమకు రావాల్సిన మొత్తాన్నే ఇవ్వాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రంలోని 12,769 గ్రామాలకు సంబంధించి బకాయిల్లో ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు.
రెండు రోజుల్లో ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ రావాలని, తమ బకాయిలు చెల్లించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చివరకు నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని, ట్రాక్టర్లు అడ్డుపెట్టి అడ్డుకుంటామన్నారు.
అంతకు ముందు మాజీ నర్పంచ్లు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యాలయం మూసి ఉండటంతో అక్కడే గేటు వద్ద వినతి పత్రాన్ని ఉంచారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మల్లయ్య యాదవ్, పద్మా రెడ్డి, రవీందర్ రావు, నరేశ్ పాల్గొన్నారు.