బొల్లారం, డిసెంబర్ 21 : బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసే జెండా ప్రతిరూపాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఆవిష్కరించారు. అదేవిధంగా శివుడు, నంది ఎద్దుల శిల్పాల విగ్రహాలను ఆవిష్కరించారు. హైదారాబాద్ చరిత్రను వర్ణించే నాలెడ్జ్ గ్యాలరీ ఎన్‌క్లేవ్‌ను ప్రారంభించారు. మేజ్ గార్డెన్, చిల్డ్రన్ పార్క్, మూడు మెట్ల బావులను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, మంత్రి సీతక్క, అధికారులు పాల్గొన్నారు.
నేడు ఎట్ హోం కార్యక్రమం.. ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం రాష్ట్రపతి ఏర్పాటు చేస్తున్న ఎట్ హోం కార్యక్రమం నేపథ్యంలో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ సుబ్బారాయుడు తెలిపారు.
ఇందులో భాగంగా లోతుకుంట టీ జంక్షన్, ఎంసీఈఎంఈ సిగ్నల్, లాల్ బజార్ టీ జంక్షన్, తిరుమలగిరి ఎక్స్ రోడ్స్, సికింద్రాబాద్ క్లబ్, తివోలి ఎక్స్ రోడ్స్, ఫ్లాజా ఎక్స్ రోడ్స్, సీటీఓ, ఎస్బీఐ జంక్షన్, రసూల్‌పురా, పీఎన్టీ ఫై ఓవర్, గ్రీన్ ల్యాండ్స్, మొన్నప్ప జంక్షన్, ఎంఎంటీఎస్, వీవీ విగ్రహం జంక్షన్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎన్ఎఫ్సీఎల్, ఎన్టీఆర్ భవన్, జుబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్లను మూసివేయడం లేదా ట్రాఫిక్ మళ్లించనున్నట్లు సూచించారు. ఈ రూట్లలో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లి ట్రాఫిక్ ఇబ్బందులకు గురికాకుండా చూసుకోవాలని సూచించారు.