HMDA | సిటీబ్యూరో: రాజు తలిస్తే దెబ్బలకు కొదువ అన్నట్లు హెచ్ఎండీఏ అధికారులు వ్యవహారిస్తున్నారు. తెలియక తప్పు చేసిన సామాన్యుడిని ముప్పు తిప్పలు పెట్టే… ప్రభుత్వ యంత్రాంగమే తప్పటడుగులు వేసేందుకు సిద్ధమైంది. పచ్చని చెట్లతో నిండి, పక్కన పారే నాలా వెంబడి భారీ వెంచర్‌కు సన్నాహాలు చేసింది. ప్లాట్లను వేలం వేస్తే భారీ ఆదాయం వస్తుందని భావించి పెద్ద ప్లాను గీసింది.
కానీ స్థానికుల ఫిర్యాదుతో పటాపంచలైంది. బంజారాహిల్స్ రోడ్ నం. 12లో ఉండే ఎమ్మెల్యే కాలనీ సమీపంలో హుడా ఉన్నప్పుడే ఖాళీ జాగాలను ప్లాట్లు చేసి విక్రయించారు. అప్పటి నుంచే ఇబ్బడిముబ్బడిగా నిర్మాణాలతో బంజారాహిల్స్ రూపురేఖలే మారిపోయాయి. దానికి అనుగుణంగా డిమాండ్ కూడా భారీగానే పెరిగింది. కానీ హుడా వేసిన లే అవుట్‌ను ఇప్పుడు రివైజ్ చేస్తూ 12 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లను డెవలప్ చేసేందుకు ఏర్పాటు చేశారు.
90 దశకంలోనే బంజారాహిల్స్‌లో హుడా హైట్స్ పేరిట భారీ లే అవుట్ అభివృద్ధి చేసి ప్లాట్లను విక్రయించారు. అదే సమయంలో పచ్చదనం పెంపొందించేలా, పార్కు కోసం స్థలాన్ని విడిచి పెట్టారు. అయితే ఆ పార్కును ఆనుకుని కొన్ని ప్లాట్లను వేలంలో విక్రయించారు. కానీ ఆ తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరగడంతో.. ఇన్నాళ్లు ఖాళీగా ఉంటూ అభయారణ్యాన్ని తలపించే ఈ 12 ఎకరాల స్థలం చిన్న చిట్టడవిగా మారింది. వృక్ష సంపదతోపాటు, అరుదైన పక్షులు కూడా ఆవాసంగా ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాయి. కానీ ఇంతలోనే ఆ ప్రాంతాన్ని లే అవుట్‌గా డెవలప్ చేసేందుకు ఆగస్టులో హెచ్ఎండీఏ పనులను మొదలుపెట్టింది.
లోటస్ పాండ్ నుంచి బయటకు వెళ్లే వరద నీటితో పాటు, డ్రైనేజీ ప్రవహించే నాలా వెంబడి నిర్మిస్తున్న ఈ లే అవుట్ బఫర్ జోన్‌లోనూ చదును చేస్తున్నారని స్థానికుల వాదన. దీంతోపాటు, ఒకప్పటి పార్క్ స్థలాన్ని లే అవుట్లుగా డెవలప్ చేసి అమ్ముకోవాలని హెచ్ఎండీఏ చూసింది. కానీ స్థానికుల ఫిర్యాదుతో ఈ వ్యవహారం వివాదంగా మారింది. కామన్ ఏరియాగా చూపిన ఈ స్థలాన్ని లే అవుట్‌గా చేయడం వెనుక అంతర్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఒకప్పుడు పార్కు స్థలాన్ని ఇప్పుడు ప్లాట్లుగా ఎలా డెవలప్ చేస్తారని హైకోర్టు మొట్టికాయలు వేసింది. దీనిపై స్థానికుల ఫిర్యాదును విచారించిన హైకోర్టు.. పార్కు స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని ఆదేశించింది. అయితే కేవలం లే అవుట్ చేయడం లేదని, డెవలప్మెంట్ కార్యాకలాపాలు నిర్వహిస్తున్నామని హెచ్ఎండీఏ అధికారులు వివరించారు.