Prajavani | సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా జరుగుతున్నది. దీర్ఘకాలిక, అపరిష్కృత సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఎంతో ఆశగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదుదారులకు అధికారుల నుంచే చుక్కెదురవుతున్నది.
ప్రజా సమస్యలను స్వీకరించి.. పరిష్కరించి అర్జీదారుల్లో భరోసా నింపాల్సిన అధికారులు.. కంటి తుడుపు చర్యగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేవలం 90 ఫిర్యాదులను మాత్రమే నేరుగా స్వీకరించారు. ప్రజావాణికి కమిషనర్ ఆలస్యంగా రాగా, ఆ సమయంలోనే అర్జీదారులు పోటెత్తారు. నిర్ణీత సమయం ముగియక ముందే కమిషనర్ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. యథావిధిగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రజావాణికి డుమ్మా కొట్టారు.