మేడ్చల్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): గ్యారంటీల అమలు అంతా గందరగోళంగా మారింది. నాలుగు గ్యారంటీల అమల్లో ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను సర్వేచేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పిన సర్కారు ప్రకటన.. పొంతన లేకుండా పోతున్నది. గ్రామ, వార్డు సభలను నిర్వహించి ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను ఎంపిక చేసి ఈ నెల 21 నుంచి జరగుతున్న గ్రామ, వార్డు సభల్లో ప్రజల సమక్షంలో ప్రకటించి.. అభ్యంతరాలను స్వీకరిస్తామన్న విషయం తెలిసిందే. అర్హుల జాబితాలో తమ పేర్లు లేవంటూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరిగాయి. దీంతో మళ్లీ అధికారులు మాట మార్చారు. గ్రామ, వార్డు సభల్లో ప్రకటించిన జాబితాలో పేర్లు రాని వారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. తాజాగా, ప్రభుత్వం గ్రామ, వార్డు సభల్లో ప్రకటించే జాబితా దరఖాస్తులు మాత్రమేనని..ఎవరూ ఆందోళన చెందవద్దని దరఖాస్తుల జాబితాలో లేని వారందరూ దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారుల ప్రకటనలతో గ్యారంటీ పథకాల వర్తింపుపై వస్తున్న ప్రకటనలతో దరఖాస్తుదారులు విస్మయనికి గురువుతున్నారు. రెండో
రోజూ అదే సీన్..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన గ్రామ, వార్డు సభల్లో రెండో రోజూ అదే సీన్ రిపిట్ అయింది. గ్రామ, వార్డు సభల్లో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారుల పేర్లను చదివిన క్రమంలో అర్హుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో అధికారులను నిలదీస్తూ ఆందోళలను చేశారు. ఆందోళన చేసిన దరఖాస్తుదారులు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని, ఇందులో అర్హులు ఉంటే పథకాలు అందిస్తామని చెప్పిన అధికారుల మాటలతో దరఖాస్తుదారులు తీవ్ర ఆగ్రహనికి గురయ్యారు. ప్రజాపాలనలో చేసిన దరఖాస్తులకు విలువ లేదా అని అధికారులను ప్రశ్నించారు. అర్హుల జాబితాలో పేర్లు లేని వారు నిరుత్సాహనికి గురవుతూనే తిరిగి దరఖాస్తులు చేసుకున్నారు.
నాలుగు గ్యారంటీల అమల్లో భాగంగా అధికారులు చేసిన సర్వేలో అవకతవకలు ఉన్నాయని గ్రామ, వార్డు సభల సాక్షిగా కాంగ్రెస్ నాయకులే ఆరోపించడం గమనార్హం. ఉద్దమర్రికి చెందిన కాంగ్రెస్ నాయకులు దొసకాల వెంకటేశ్, విష్టుగౌడ్, కృష్ణారెడ్డి, మధు, వెంకట్‌రెడ్డి ఆరోపిస్తూ.. అధికారులతో వాగ్వాదానికి దిగారు. గ్రామ, వార్డు సభల్లో ప్రకటించిన జాబితాలో అసలు అర్హులే లేరని ఆరోపిస్తూ రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు.
కాంత్రసోళ్లు కుట్రలు చేసి.. వాళ్లు అనుకున్నోళ్లకే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుండ్రు. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు కావాలని దరఖాస్తు పెడితే.. ఒక్కటి కూడా ఇవ్వలేదు. గతంలో పథకాలు వస్తే పార్టీలు చూడలేదు. అర్హులై ఉన్న వాళ్లందరికీ ఇచ్చిండ్రు. ఇప్పుడేమో కాంగ్రెస్ వాళ్లకే ఇస్తుండ్రు. ఇదెక్కడి న్యాయమని అడిగితే మళ్లీ దరఖాస్తు పెట్టుకోమంటున్నారు. అందరికీ సమానంగా పథకాలు పంచాలే తప్ప.. వివక్ష చూపొద్దు.
-గుండె మంజుల, ఘట్కేసర్
నా కుడి చెయ్యి సరిగా పనిచేయదు. కాంగ్రెసోళ్లకు తప్ప.. అర్హులెవరికీ ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేర్లు రాలేదు. కిరాయి ఇండ్లలో ఉంటున్నా.. మమ్మల్నీ వదిలేసి కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తుండ్రు. నాకు పింఛన్, రేషన్‌కార్డు, ఇల్లు ఏదీలేదు. అప్పుడు అన్నీ ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని.. ఇప్పుడు రేపు మాపు అంటూ తిప్పుతుండ్రు. మా పేరు ఎందుకు రాలేదని గట్టిగా అడిగితే మళ్లీ దరఖాస్తు చేసుకోమని చెబుతుండ్రు.
-లక్ష్మీ కురుమ, ఇందిరనగర్కాలనీ, చెంగిచర్ల బోడుప్పల్
రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చేముందు ఇస్తామన్న ఒక్క హామీ కూడా ఆచరణలో లేదు. రేషన్ కార్డు రాలే, ఇందిరమ్మ ఇండ్లు రాలేదు. అంగు ఆర్భాటాలతో సభలు పెట్టిండ్రు. ఏమి చెబుతున్నారో వారికే తెలియదు. అవగాహన లేకుండానే సభలు పెట్టి నమ్మించేందుకు మాయమాటలు చెబుతున్నారు. వాళ్ల మాటలు నమ్మబుద్ధి కావడం లేదు. ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం ఏదీ రాదని అర్థమైంది.
– సిద్దుల శ్యామల, ఘట్కేసర్