హైదరాబాద్/సిటీబ్యూరో, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): వచ్చే వేసవిలో రాష్ట్ర వ్యాప్తంగా 20 నుంచి 25 శాతం వరకు విద్యుత్తు డిమాండ్ పెరిగే అవకాశమున్నదని ఎస్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. గ్రేటర్ పరిధిలో నిరుడు 3,756 మెగావాట్లు ఉన్న గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ ఈ ఏడాది 16 శాతం వృద్ధితో 4,352 మెగావాట్లుగా నమోదైందని వెల్లడించారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని సంస్థ కార్యాలయంలో ఆయన అధికారులతో గురువారం సమీక్షించారు.
జీహెచ్ఎంసీ శివారులోని నెమలినగర్, గోపన్‌పల్లి, కోకాపేట, కోహెడ, తట్టి అన్నారం, అబ్దుల్లాపూర్‌మెట్, మన్సాన్పల్లి, అజీజ్‌నగర్, కందుకూరు, కే సింగారం, మల్లాపూర్, వాయుపురి, ఉప్పల్ భగాయత్, దుండిగల్ ఏరియాల్లో డిమాండ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. ఆయా చోట్ల అవసరాలకు తగినట్టు 220/132/33 కేవీ సబ్స్టేషన్ల ఏర్పాటు, సరఫరా, పంపిణీ వ్యవస్థలను పటిష్టం చేయాలని సూచించారు. నిర్వహణ, మరమ్మతు పనుల్లో వేగం పెంచి సంక్రాంతిలోగా పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ట్రాన్స్‌కో డైరెక్టర్ జగత్‌రెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ నర్సింహులు, చీఫ్ ఇంజినీర్లు శ్రీరాంజి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.