మేడ్చల్, మార్చి28(నమస్తే తెలంగాణ): రైతులకు కరెంట్ కోతలు షురూ అయ్యాయి. సమయపాలన లేని సరఫరాతో ఇబ్బందులు పడుతున్నారు. పొట్టదశకు వస్తున్న వరి పంటకు సాగునీటిని అందించలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 24 గంటల పాటు అందించే కరెంట్‌తో వ్యవసాయాన్ని పండుగలా చేసిన రైతులు ఇప్పుడు భారంగా మారుతుందని ఆవేదన చెందుతున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో వ్యవసాయానికి 12 గంటలు మాత్రమే కరెంట్ సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే సరఫరా చేస్తున్నారని, రెండు మూడు సార్లు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఎకరాల్లో 25 ఎకరాల వరి పంట సాగు చేస్తుండగా మరో 20 ఎకరాల్లో వివిధ రకాల పంటలతో పాటు కూరగాయలను సాగు చేస్తున్నారు. పెరుగుతున్న ఎండలతో 12 గంటల పాటు ఇచ్చే కరెంట్‌తో పంటలకు తడి అందడం లేదు.
పొట్ట దశలో ఉన్న వరి పంటకు ఇప్పుడు తడులు అవసరం ఉంటుంది. పంటలకు నీటిని అందించనట్లయితే దిగుబడులు తగ్గిపోతాయని అన్నదాత ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్ల పాటు 24 గంటల కరెంట్ సరఫరా అయ్యేదని ఇప్పుడు మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు.
పంట పొలాల్లో ఉండే ట్రాన్స్ఫార్మర్లు పేలితే మరమ్మతులకు రైతులే ట్రాన్స్‌కో కార్యాలయాలకు తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. తరలించే ఖర్చును కూడా రైతులే భరిస్తున్నారు. ఒక్క ట్రాన్స్ఫార్మర్కు 10 నుంచి 15 కరెంట్ కనెక్షన్లు ఉంటాయి. మరమ్మతులకు ట్రాన్స్ కో అధికారులే తీసుకెళ్లి చేయించి తిరిగి తీసురావాల్సి ఉంటుంది. నాణ్యత లేని కరెంట్ సరఫరాతో ట్రాన్స్ఫార్మర్లపై భారం పడుతుందని రైతులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్న నేపథ్యంలో కరెంట్ 24 గంటలు సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
12 గంటల కరెంట్ సరఫరాతో పంటలకు నీటిని ఎలా అందించాలి. కరెంట్ సరఫరాలో అనేక అంతరాయల వల్ల పంటలకు నీటిని అందించడం కష్టంగా మారింది. ఇప్పుడే పంటలు పొట్ట దశకు వస్తున్నాయి. పొట్ట దశకు వచ్చే సమయంలో నీటిని అందించాల్సి ఉంటుంది. నీటిని అందించకపోతే దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందించేలా చర్యలు తీసుకోవాలి. కరెంట్ సరఫరా చేసే సమయాన్ని అధికారులు చెప్పడం లేదు.
– మధుకర్‌రెడ్డి,మాజీ డీసీఎంఎస్ వైస్ చైర్మన్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది. సకాలంలో ఎరువులు, మందులు దొరకడం లేదు. రైతుబంధు సక్కగా వస్తలేదు. కరెంట్ సక్రమంగా వస్తలేదు. మధ్య మధ్యలో పోతుంది. ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువైతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతుకు ఇబ్బంది ఉండేది కాదు. కరెంట్ సక్రమంగా వచ్చేది. పండించిన పంటను కొనేవారు. ఆయన వల్లే రైతు గౌరవం పెరిగింది.
– రాజు యాదవ్, రైతు, కీసర
కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తే ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. మధ్య మధ్యలో కరెంట్‌ను పోతుంది. ఈ కోతలు ఇలాగే ఉంటే ఎండాకాలంలో పంటలు ఎండిపోతాయి. కేసీఆర్ లాంటి సీఎంను చూసినట్టు నేను పుట్టినప్పటి నుంచి ఎవ్వరిని చూడలేదు. పంట వేసినప్పటి నుంచి అమ్ముకునే వరకు అండగా ఉన్నారు. రెప్పపాటు కూడా కరెంట్ పోయేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు గురించి పట్టించుకోవడం లేదు.
– లక్ష్మయ్య, రైతు కీసర
వరి పంటకు సమృద్దిగా నీరు అవసరమున్న ఈ కీలక దశలో వ్యవసాయానికి కరెంట్ కట్ కావడంతో ఇబ్బంది అవుతున్నది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎప్పుడూ కరెంట్ ఉండేదని, అప్పడు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఈ సమయంలో కరెంట్ పోకుండా చూడాలి.
– గుమ్మడిదల అశోక్, రాజబొల్లారం
ఎండాకాలంలో పంటలు ఎండకుండా ఉండాలంటే కరెంట్ పోకుండా నిరంతరం ఉండాలి. చెప్పకుండా కరెంట్ తీసివేయడం, కట్ చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సక్రమంగా కరెంట్ ఇచ్చి పంటలకు ఇబ్బంది లేకుండా చూడాలి.
– లక్ష్మీనారాయణ, రాజబొల్లారం
కరెంట్ ఇష్టానుసారంగా ఇస్తున్నారు. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. పంట పొట్టకొచ్చే దశలో నీళ్ల అవసరం చాలా ఉంటుంది. ఎండలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు ఇలాగే కరెంట్ పోతే పంటలకు భారీగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
– రేగు లక్ష్మణ్, గోసాయిగూడ