సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ఎండలు ముదురుతుండడంతో హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. మార్చి తొలివారంలోనే గత ఏడాది మే నెల కంటే అత్యధిక వినియోగం నమోదవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి కోతలు పెట్టకుండా 24గంటలు కరెంట్ సరఫరా చేయాలంటూ ప్రభుత్వం చెబుతున్నా పలు ప్రాంతాల్లో ట్రిప్పింగ్‌లు వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
విద్యుత్ సరఫరాలో అంతరాయాలుంటే ఐదు నుంచి పదినిముషాల్లో గుర్తించి పరిష్కరిస్తామని దక్షిణ డిస్కం అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. నగరంలో పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయిందని అధికారులకు ఫోన్ చేసినా స్పందన ఉండదు. కనీసం టోల్‌ఫ్రీ నంబర్ 1912కు చేద్దామంటే ఉలుకులేదు పలుకూ లేదు.
అంతేకాకుండా ఒక మెసేజ్ పంపిస్తారు. ప్రస్తుతం ఈ నంబర్ ఎలాంటి కాల్స్ స్వీకరించడం లేదంటూ వినియోగదారుల మొబైల్‌కు ఒక సమాచారం వస్తుంది. దీంతో నెటిజన్లు ఎస్పీడీసీఎల్ పనితీరుపై మండిపడుతున్నారు. ఇక ఫ్యూజ్ఆఫ్కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసినా ఫలితం ఉండడం లేదు. రంజాన్ మాసంలో ప్రార్థనల సమయంలో, విద్యార్థుల పరీక్షల సమయంలో ఈ కరెంట్ కోతలపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత పదిరోజులుగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. వేసవి మొదలుకాగానే నగరంలోని ప్రతీప్రాంతంలో రోజుకు ఒకటిరెండు సార్లు కరెంట్ పోతున్నదని వినియోగదారులు చెబుతున్నారు. ఈ అప్రకటిత కరెంట్ కోతలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. ఎప్పటికప్పుడు గంటల కొద్దీ పవర్‌కట్ సమస్యలు పలు ప్రాంతాల్లో ఏర్పడుతున్నా ఉన్నతాధికారులు మాత్రం కార్యాలయాలు వదిలి బయటకు రావడం లేదు.
విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతూ పవర్ ఫీడర్లపై అధిక ఒత్తిడి కారణంగా ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయి. అయినా క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని సీఎండీ జితేష్ వీ పాటిల్ చెప్పినా అధికారుల చెవికి ఎక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరెంట్ పోయిందని టోల్‌ఫ్రీనెంబర్ 1912కు ఫోన్ చేస్తే గంటల కొద్దీ ఎంగేజ్ లేదా మీ సమస్యను తీసుకోవడం లేదంటూ ఒక మెసేజ్ వస్తున్నదని నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా మండిపడుతున్నారు. డిమాండ్ ఎంతపెరిగినా రెప్పపాటు అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ ఇస్తామని మంత్రి భట్టివిక్రమార్క చెప్పి ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేస్తే అధికారులు క్షణాల్లో ఆ సమస్యను పరిస్కరిస్తారని గతంలోనే చెప్పారు.
కానీ ఈ నెంబర్ నామమాత్రంగానే పనిచేస్తున్నదని, ఎప్పుడో ఒకసారి సమస్యలు తీసుకోవడమే తప్ప వినియోగదారులకు ఈ నంబర్ పనితీరు అసలు ఉపయోగపడడం లేదని నగరవాసులు చెప్పారు. ఇక ఎఫ్ఓసీ నంబర్ కానీ, ఇతర ఏఈ, లైన్మెన్ల నెంబర్లకు కాల్ చేస్తే వారి నుంచి సమాధానమే ఉండదని, ఒకవేళ వారు స్పందించినా చాలా నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారంటూ వినియోగదారులు పోస్ట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే పవిత్ర రంజాన్ మాసంలో పాతబస్తీతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏ నిముషానికి కరెంట్ ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక బస్తీవాసులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తమ సోషల్‌మీడియా అకౌంట్లలో కరెంట్‌కోతల సమయాలను ప్రస్తావిస్తూ ప్రార్థనల సమయంలో ఈ కరెంట్ కోతలేంటని మండిపడుతునానరను.
తాడ్బన్ ఏరియాలో కేవలం ముప్పై నిముషాల్లో మూడుసార్లు కరెంట్ పోయిందని, గత వారంరోజులుగా ప్రతీరోజూ ఇలాగే ఏడెనిమిది సార్లు కరెంట్ తీసున్నారని మహ్మద్ ఆసిఫ్‌ఖాన్ నే వ్యక్తి పోస్ట్ చేశారు. ప్రత్యేకించి రంజాన్ సమయంలో ఇలా కరెంట్ తీసేయం ఏంటంటూ ప్రశ్నించారు. కాలాపత్తర్ నాలుగైదుగంటల పాటు కరెంట్ తీసేస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వంలో ఇలా ఎప్పుడూ జరగలేదంటూ, కస్టమర్ సర్వీసులు ఏమాత్రం బాగాలేవంటూ మహ్మద్ బాబర్ అనే వ్యక్తి పోస్ట్ చేశారు.
ఉప్పల్ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి ముక్తార్ అహ్మద్ వెంకటేశ్వరస్వామిగుడి సమీపంలో మూడునాలుగుగంటలపాటు కరెంట్ తీసేస్తున్నారని, అదికూడా రా త్రిసమయంలో తీసేయడం వల్ల విద్యార్థులకు పరీక్షల ప్రిపరేషన్ చాలా ఇబ్బంది కలుగుతున్నదని పేర్కొన్నారు. రంజాన్ మాసం అంతేకాకుండా వేసవితీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో కరెంట్ కోతలేంటంటూ సయ్యద్ జేన్ అనే వ్యక్తి మండిపడ్డారు. ఇలా సోషల్ మీడియా ప్రత్యేకించి ఎక్స్ వేదికగా వస్తున్న ఫిర్యాదులకు ఎస్పీడీసీఎల్ రొటీన్ సమాధానంగా డిటైల్స్ నమోదు చేసుకుని సంబంధిత అధికారికి సమాచారమిస్తామని చెబుతన్నారు తప్ప ఈ ఫిర్యాదులపై స్పందించడం లేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.