సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ‘విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలు బస్తీలు, కాలనీల్లో కరెంటు కోతలు, తరచూ అంతరాయాలతో ఇబ్బందులు పడుతున్నాం. మా కాలనీలో లోవోల్టేజీ సమస్య ఉంది.. ఇందుకు ప్రత్యేకంగా అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలి. పలు చోట్ల ఇండ్ల మీదుగా విద్యుత్ లైన్లు ఉండటంతో నిత్యం భయంతో గడపాల్సి వస్తున్నది.’ ఇలా వివిధ సమస్యలను విద్యుత్ వినియోగదారుల దినోత్సవంలో భాగంగానిర్వహించిన సమావేశంలో ఉన్నతాధికారుల అధికారుల దృష్టికి స్థానిక వినియోగదారులు తీసుకువచ్చారు.
ఆదివారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు సర్కిళ్లలో విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించింది. గ్రేటర్ పరిధిలోని మెట్రో జోన్, రంగారెడ్డి జోన్లలోని పలు సర్కిళ్లలో వినియోగదారులతో నేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను లేఖల ద్వారా అధికారులను అందజేయడంతో పాటు నిరంతరం నాణ్యమైన సరఫరా చేయడం లేదనే అంశంపైనే ఎక్కువ ఫిర్యాదులు చేశారు. బాలానగర్ చిత్తారమ్మ బస్తీలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించి ఐదేండ్లు అవుతున్నా.. వారి పేరిట కరెంట్ బిల్లులు జీహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పేరిట బిల్లు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు.
అదేవిధంగా ఇంటి పై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లను సరి చేయాలని, కొత్తవి ఏర్పాటు చేయాలని తదితర సమస్యలపై పరిష్కారాన్ని కోరుతూ 9 మంది వినతి పత్రాలు సమర్పించారు. కొత్త లైన్లు వేయాలని, వదులుగా ఉన్న తీగలను సరి చేయాలని, లో వోల్టేజీ సమస్య ఉన్నదని, హబ్సిగూడ సర్కిల్ పరిధిలోని జరిగిన విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సమావేశంలో అధికారులకు వినియోగదారులు సమస్యలపై ఫిర్యాదు చేశారు.
తమ ప్రాంతంలో కరెంటు సరఫరా నిలిచిపోయిందని ఫిర్యాదు చేసినా సరిగా స్పందించరని, 5-10 నిమిషాల్లో వస్తుందని చెప్పి, గంట గడిస్తేనే కానీ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కావడం లేదని కొందరు వినియోగదారులు వాపోయారు. ఒక పక్క ప్రభుత్వం విద్యుత్ కోతలు లేవని, 24 గంటలు సరఫరా చేస్తున్నామని ప్రకటిస్తుంటే… క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నంగా ఉన్నదని వినియోగదారులు అధికారులకు వివరించారు. ముఖ్యంగా ఇటీవల వర్షా కాలంలో విద్యుత్ అంతరాయాలు బాగా పెరిగాయని, దీనికి ప్రధాన కారణం క్షేత్ర స్థాయిలో విద్యుత్ లైన్ల నిర్వహణ, మరమ్మతులు సరిగా చేయకపోవడం వల్లే జరుగుతున్నదని పేర్కొన్నారు.
విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నా, సరిగా స్పందించడం లేదని, రకరకాల కారణాలు చెబుతున్నారే తప్ప..శాశ్వత పరిష్కారం చూపడం లేదని పలువురు వినియోగదారులు సెక్షన్ పరిధిలోని అధికారుల తీరుపై మండిపడ్డారు. డిమాండుకు సరిపడా కరెంటు ఉన్నప్పుడు లోవోల్టేజీ సమస్యకు అవకాశం ఉండదని, కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల లోవోల్టేజీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లపై పెరిగిన భారాన్ని గుర్తించి, అక్కడ అదనంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం, దాన్ని సామర్థ్యాన్ని పెంచడమో చేయాల్సి ఉన్నా, ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్లే లోవోల్టేజీ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని పలువురు అధికారుల ముందు వినియోగదారులు వాపోయారు.